
కదిలిస్తే కన్నీళ్లే !
● భారీ వరదల ప్రభావం నుంచి
కోలుకోని బాధితులు
● మూడు రోజుల తర్వాత జీఆర్ కాలనీ,
హౌజింగ్‌బోర్డులకు విద్యుత్ సరఫరా
కామారెడ్డి టౌన్: మునుపెన్నడూ లేని విధంగా జిల్లాకేంద్రంలో ఒక్కసారిగా ముంచెత్తిన వరదలు.. పలు కాలనీల ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. నాలుగు రోజులు గడిచినా ఆనాటి వరద బీభత్సాన్ని మర్చిపోలేకపోతున్నారు. బాధితులను కదిలిస్తే కన్నీళ్లు సమాధానంగా వస్తున్నాయి. బుధవారం ఉదయం ఒక్కసారిగా వచ్చిన వరదలతో పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, జీఆర్ కాలనీలు నీట మునిగిన విషయం తెలిసిందే. జీఆర్ కాలనీ, హౌసింగ్‌బోర్డు కౌండిన్య ఎన్‌క్లేవ్‌లలో 100కు పైగా ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. వరదతో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వదలని బురద
జీఆర్ కాలనీ, హౌసింగ్‌బోర్డులోని కౌండిన్య ఎన్‌క్లేవ్‌వాసుల కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. వరద తగ్గి మూడు రోజులవుతున్నా ఇంకా బురద కష్టాలు తీరడం లేదు. ఇళ్లలోకి చేరిన బురదను తొలగించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. బురదతో తడిసి ముద్దయిన సామగ్రిని అంతా చెత్త కుప్పల్లో వేస్తున్నారు. వరదలో సుమారు 18 కార్లు కొట్టుకుపోయాయి. పాక్షికంగా పలు ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఈ రెండు కాలనీలవాసులు నాలుగు రోజులుగా సరైన తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. శనివారం స్వచ్ఛంద సంస్థలు భోజనాలు సమకూర్చాయి.
విద్యుత్ సరఫరా పునరుద్ధరించినా..
స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లకు మరమ్మతులు చేసి శనివారం మధ్యాహ్నం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఆదివారం వరకు ఎవరూ స్విచ్‌లను ఆన్ చేయవద్దని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు.
పక్కింటివాళ్లే ఆదుకున్నారు
ఇంట్లోకి ఒక్కసారిగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులం ఇంటిపైకి వెళ్లాం. వర్షంలో కొంత సమయం గడిపాం. పక్కంటి వాళ్ల కిటికిలోంచి వారింటిలోకి వెళ్లి వాళ్ల వద్ద క్షేమంగా ఉన్నాం. వాళ్లే మాకు తిండి పెట్టారు. విలువైన సర్టిఫికెట్లు, సామాన్లు అన్నీ తడిసిపోయాయి. – రమేశ్, జీఆర్ కాలనీవాసి

కదిలిస్తే కన్నీళ్లే !