
మారుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యం
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
● పనుల జాతరలో భాగంగా పలు గ్రామాల్లో
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
డిచ్‌పల్లి/నిజామాబాద్‌రూరల్: మారుమూల, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఈనేపథ్యంలోనే ‘పనుల జాతర–2025’ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. రూరల్ మండలంలోని శ్రీనగర్, తిర్మన్‌పల్లి, పాల్దా గ్రామాల్లో శుక్రవారం చేపట్టిన పనుల జాతర కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి హాజరయ్యారు. వారు ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పాల్దా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు, డ్రైనేజీలు, సోక్ పిట్స్, అంగన్వాడి భవనాలు, పశువుల కొట్టాలు, కోళ్ల ఫారాలు, గొర్రెల షెడ్లు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఒక్క రూరల్ నియోజకవర్గం పరిధిలోనే 33 అంగన్‌వాడి భవనాలను ఏకకాలంలో చేపడుతున్నట్లు వివరించారు. ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలువాలని కోరారు. ఏఎంసీ చైర్మన ముప్ప గంగారెడ్డి, తహసీల్దార్ అనిరుధ్, ఎంపీడీవో రాంనారాయణ, నాయకులు అగ్గు భోజన్న, ఒడ్డెన్న, సొసైటీ చైర్మన్ శ్రీధర్, ఆశన్న, బాగిర్తి బాగారెడ్డి పాల్గొన్నారు.
డిచ్‌పల్లి మండలంలో..
డిచ్‌పల్లి మండలం ముల్లంగి(ఐ) గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీతో కలిసి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధిహామీ పథకం కింద పెద్ద ఒడ్డెన్న అనే రైతుకు మంజూరు చేసిన పశువుల కొట్టం నిర్మాణానికి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పనుల జాతరలో భాగంగా గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనులను విరివిగా చేపడుతూ, గ్రామాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలన్నారు. రానున్న వారం పది రోజుల్లో జిల్లాలో అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి శంకర్, డీఎల్‌పీవో శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్‌వీర్, ఎంపీవో శ్రీనివాస్ గౌడ్, ఏపీవో మంజుల, సొసైటీ చైర్మన్ రాంచందర్‌గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ గ్యానాజి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.