
విద్యార్థుల హాజరు శాతం పెంచాలి
నిజామాబాద్ అర్బన్: విద్యార్థుల హాజరు శాతం పెంచడంపై అధ్యాపకులు శ్రద్ధ వహించాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ సూచించారు. నగరంలోని ప్రభుత్వ బాలుర (ఖిల్లా) జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, అధ్యాపకుల పనితీరును స్వయంగా పరిశీలించారు. ప్రిన్సిపల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు ఇకనుంచి ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశం మేరకు ఫెసియల్ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. అధ్యాపకులు సమన్వయంతో పని చేస్తూ బోధన తీరును మెరుగుపరుచుకోవాలన్నారు. ప్రత్యేక స్టడీ అవర్స్ కూడా ప్రతి రోజూ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అడ్మిషన్‌ల గడువు పొడిగించినందున అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు.