
నిండుకుండలా శ్రీరాంసాగర్
36.20 మెగావాట్ల విద్యుదుత్పత్తి..
● ప్రాజెక్టులో 80 టీఎంసీల నీటి నిల్వ
● ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరద
బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. గత వారం రోజుల నుంచి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ప్రాజెక్టుకు కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ నీటితో కళకళలాడుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 80.5 టీఎంసీలు కాగా శుక్రవారం ప్రాజెక్ట్‌లో 80 టీఎంసీల వరకు నీటి నిల్వను ఉంచారు.
కొనసాగుతున్న నీటి విడుదల
ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పెరగడంతో గురువారం రాత్రి నుంచి మళ్లీ వరద గేట్ల ద్వారా నీటి విడుదలను గోదావరిలోకి ప్రారంభించారు. ఉదయం నుంచి కూడ వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్ట్ నుంచి 16 వరద గేట్ల ద్వారా 49 వేల 280 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి ఆధారంగా ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదలను పెంచుతూ తగ్గిస్తున్నారు.
ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు..
ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టకు కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 6500 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 1500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 651 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1090.90(80 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.
ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా, ఎస్కెప్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ వద్ద గల జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 36.20 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. నాలుగు టర్బయిన్‌ల ద్వారా 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ నీటిమట్టం నిండుగా ఉండటంతో ఎక్కువగా విద్యుదుత్పత్తి జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8.12 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని జెన్‌కో డీఈఈ శ్రీనివాస్ తెలిపారు.