
వృద్ధులకూ సంఘాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): ఇప్పటి వరకు మనం (ఎస్‌హెచ్‌జీ) స్వయం సహాయక మహిళా సంఘాలనే చూశాం.. త్వరలో వృద్ధుల సంఘాలను కూడా చూడబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. గ్రామాల్లో 60ఏళ్లు పైబడిన వృద్ధ మహిళలను గుర్తించేపనిలో ఐకేపీ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరు నాటికి కొన్ని సంఘాలైనా ప్రారంభించాలనే లక్ష్యంతో కసరత్తు వేగవంతం చేశారు. ఇప్పటికే శిక్షణ పొందిన సిబ్బంది గత వారం రోజులుగా వృద్ధ మహిళలను గుర్తించి ఎప్పటికప్పుడు జిల్లా శాఖకు వివరాలు నివేదిస్తున్నారు. ప్రతి సంఘంలో పది మంది ఉండేలా చూస్తున్నారు. సభ్యులను గుర్తించి వారి పేర్లు నమోదు చేస్తున్నారు. సంఘానికి పేరు పెట్టి బ్యాంకు ఖాతా తీసి ఒకరిని లీడర్‌గా ఎంపిక చేస్తున్నారు. వృద్ధ మహిళల సంఘాల ద్వారా వారి అవసరాలు, సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తారు. నిరక్ష్యరాసులకు చదువు సైతం చెప్పిస్తారు. కుటుంబసభ్యులు, సంతానం తమను పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు కూడా సంఘం ద్వారా అధికారులకు తెలియజేసే అవకాశం కలుగనున్నది. అలాగే చిన్నగా పొదుపు డబ్బులు జమ చేయించి అత్యవసర పరిస్థితిలో వారికే ఉపయోగిస్తారు. డబ్బులు చెల్లించే స్థోమత ఉన్న సంఘాలకు కొద్దిపాటి రుణం కూడా ఇవ్వనున్నారు. సభ్యులను గుర్తించి సంఘాలు చేయడంలో ఏర్గట్ల, కోటగిరి, బాల్కొండ, మాక్లూర్, రుద్రూర్, నవీపేట్, చందూర్, బోధన్, డిచ్‌పల్లి మండలాలు వేగంగా పనిచేస్తున్నాయి. ఐతే, రాష్ట్రంలోనే మొదటి వృద్ధుల సంఘం జిల్లాలోని ఏర్గట్ల మండలంలో ఏర్పాటైంది. ఆ సంఘానికి ‘అమ్మ’ వృద్ధుల సంఘం అని పేరు పెట్టారు.
త్వరలో ప్రారంభం..
ప్రభుత్వ ఆదేశాల ప్రకా రం జిల్లాలో వృద్ధ మహిళా సంఘాలను ఏర్పాటు చే సేందుకు గ్రామాల్లో సభ్యులను గుర్తిస్తున్నాం. సంఘాల పేర్లు నమోదు చేసుకొని ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసే పని జరుగుతోంది. త్వరలోనే వృద్ధ మహిళా సంఘాలను ప్రారంభిస్తాం.
– సాయాగౌడ్, డీఆర్డీవో, నిజామాబాద్
ఆర్థిక పరమైన శిక్షణ
15–18 సంవత్సరాలు గల కిశోర బాలికలకు సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో కూడా పది మంది సభ్యులుగా ఉంటారు. సంఘాలు చేసిన తర్వాత సామాజిక రుగ్మతలపై వీరికి అవగాహన కల్పిస్తారు. బయట తిరిగే సమయంలో తీసుకునే జాగ్రత్తలు, ఆర్థికపరమైన శిక్షణలు ఇవ్వనున్నారు. శారీరక సమస్యలపై సలహాలు ఇస్తారు. అదేవిధంగా దివ్యాంగులకు సైతం సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఈ సంఘంలో మహిళలు, పురుషులను కలిపి సంఘాలుగా చేసుకునే అవకాశముంది. దివ్యాంగుల సంఘంలో వారి సమస్యలు, సదరంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ పథకాలు, పింఛన్లు తదితర వాటిపై అవగాహన కల్పిస్తారు. స్థోమత మేరకు ఐకేపీ ద్వారా రుణాలు సైతం ఇప్పిస్తారు.
క్షేత్రస్థాయిలో మహిళా సభ్యులను
గుర్తిస్తున్న ఐకేపీ సిబ్బంది
కిశోర బాలికలు, దివ్యాంగుల
సంఘాలు కూడా..
రాష్ట్రంలోనే మొదటి మహిళా వృద్ధుల
సంఘం ఏర్గట్లలో ఏర్పాటు

వృద్ధులకూ సంఘాలు