
గట్టెక్కించిన బఫర్ స్టాక్
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రస్తుతం రాష్ట్రమంతా యూరియా లొల్లి నడుస్తోంది. వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో కొరత తీవ్రంగా ఉండడంతో అక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వ్యవసాయ ఆధారిత జిల్లాగా గుర్తింపు ఉన్న మన జిల్లాలో మాత్రం అలాంటి పరిస్థితులు ఇప్పటి వరకు తలెత్తకపోవడానికి కారణం అధికారుల ముందు చూపేనని చెప్పొచ్చు. వానాకాలం సీజన్‌కు ముందుగానే జిల్లాలో అందుబాటులో ఉంచిన 9వేల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ (యూరియా) గండం నుంచి గట్టెక్కించింది. వ్యవసాయ శాఖతోపాటు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం, రోజువారీగా పరిస్థితిని సమీక్షించి అవసరమైన ప్రాంతాలకు యూరియా తెప్పించి రైతులకు అందేలా చూశారు. ప్రజాప్రతినిధులు కూడా వారివంతు కృషి చేశారు. గ్రామగ్రామానా సొసైటీ గోదాములు ఉండడంతో రవాణాకు రైతులు ఇబ్బందులు పడలేదు. ప్రస్తుతం జిల్లాలో వరినాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్‌రూరల్ నియోజకవర్గాల్లో అక్కడక్కడ మాత్రమే కొంతమేర నాట్లు పడే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతాల సొసైటీల్లో యూరియా స్టాక్‌ను ఉంచారు. ఇటు రైతులు బస్తాల్లోని యూరియా తగ్గించి ద్రవ రూపంలో ఉండే నానో యూరియా వాడే విధంగా వ్యవసాయాధికారులు చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలించాయని చెప్పొచ్చు.
జిల్లాకు అవసరమైన యూరియా 75 వేల మెట్రిక్ టన్నులు
ఇప్పటి వరకు వచ్చింది 67,529 మె.ట.
రైతులు కొనుగోలు చేసింది 62,254 మె.ట.
అందుబాటులో ఉన్న స్టాక్ 5,275 మె.ట.
వచ్చింది వచ్చినట్లుగా..
జిల్లాలో ఈ సీజన్‌లో 5,24,506 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఇందులో ప్రధానంగా వరి 4,36,700 ఎకరాల్లో, మొక్క జొన్న 52,093 ఎకరాల్లో, సోయా 33,603 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. అయితే జిల్లాకు తెప్పించిన యూరియా వచ్చింది వచ్చినట్లుగా అమ్ముడైంది. కొరత వస్తుందేమోనని రైతులు పంటకు అవసరమయ్యే మూడు దఫాల యూరియాను ఒకేసారి తీసుకెళ్లి ఇళ్లలో, గోదాముల్లో నిల్వ చేసుకున్నారు. దీంతో రైతులకు మళ్లీ యూరియా అవసరం లేకుండా పోయింది. శాసీ్త్రయంగా వేయాల్సిన ఎరువులు ఎకరానికి ఒకటి, రెండు బస్తాలు ఎ క్కువగా వేయడంతో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఈ అమ్మకాలపై జిల్లా యంత్రాంగం కూడా నిఘా పెట్టింది. ప్రభుత్వం రాయితీపై అందించే యూరియాను వ్యవసాయేత పనులకు వాడుతున్నారా? అనే అనుమానంతో అధికారులు పలు పరిశ్రమల్లో తనిఖీలు చేశారు.
జిల్లాలో యూరియా కొరత
తలెత్తకపోవడానికి కారణం అదే..
ఎప్పటికప్పుడు తెప్పించిన
వ్యవసాయ శాఖ
అధికారుల ముందుచూపుతో
తప్పిన గండం
ఇంకా 290 పాయింట్లలో
అందుబాటులో ఉన్న స్టాక్
పరిస్థితులను అధిగమించాం
జిల్లాలో యూరియా కొరత వంటి పరిస్థితులు రాకపోవడం అదృష్టం. రాష్ట్ర ఉన్నతాధికారులతోపాటు కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి జిల్లాకు యూరియాను తెప్పించారు. రైతులకు అవసరం మేరకు అందించాం. బఫర్ స్టాక్ చాలా వరకు మేలు చేసింది. జిల్లాలో ఇంకా 5వేల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా నిల్వలున్నాయి. సరిపోకపోతే ఇంకా తెప్పిస్తాం. – మేకల గోవింద్, డీఏవో

గట్టెక్కించిన బఫర్ స్టాక్