
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,
సీపీ సాయిచైతన్య హితవు
● వినాయక చవితి, మిలాద్–ఉన్–నబీ నేపథ్యంలో శాంతి కమిటీ సమావేశం
నిజామాబాద్ అర్బన్: వినాయక చవితి, మిలాద్–ఉన్–నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఉత్సవాలను పురస్కరించుకొని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ సాయి చైతన్య సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తిస్థాయిలో సహాయ స హకారాలు అందిస్తామన్నారు. రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డుగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామన్నారు. ప్రతి సంవత్సరం సహద్భావ వాతావరణంలో వేడుకలు జరుగుతాయని, ఈసారి కూ డా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉత్సవాలు జరుపుకొ ని జిల్లా ప్రతిష్టను పెంపొందించాలని కోరారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ శబ్దాలతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున మంటపాల వద్ద డీజే సౌండ్లను నిషేధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా చెరువులు, గోదావరి పరీవాహ క ప్రాంతాల వద్ద సరిపడా సంఖ్యలో క్రేన్‌లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ , ట్రెయినీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రవిబాబు, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్‌పై పటిష్ట నిఘా..
మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై పటిష్ట నిఘా ఉంచామని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపా దం మోపాలని సూచించారు. మాదకద్రవ్యాల విక్రేతలు, రవాణా చేసే వారిపై పీడీ యాక్టును ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని హె చ్చరించారు. డ్రగ్స్ వాడకంతో కలిగే దుష్పరిణామాలపై ప్రజలను చైతన్యపర్చాలని సూచించా రు. ‘డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్ ఎనాలిసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (డోపమ్)’ పోర్టల్ ద్వారా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను రవాణా చేసే వారిని, వాటిని విక్రయిస్తున్న, వినియోగిస్తున్న వారిని పక్కాగా గుర్తిస్తూ నిఘా కొనసాగిస్తున్నామని సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు. ఈ పోర్టల్ సహాయంతో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని, ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.