
ఏటీఎంలో కాలిబూడిదైన రూ.5లక్షలు
● మిగతా నగదును తీసేసిన
బ్యాంక్ సిబ్బంది
● దుండగుల కోసం మూడు బృందాలతో పోలీసుల గాలింపు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలో దుండగులు ఏటీఎం చోరీకి యత్నించిన కేసులో రూ.5లక్షలకు పైగా నగదు కాలిబూడిదైంది. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలోని ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున చోరీకి యత్నించిన విషయం తెలిసిందే. కేసు ఛేదనలో భాగంగా పోలీసులు విచారణ చేపట్టారు. మారుతీవ్యాన్‌లో వచ్చిన దుండగుల్లో ముగ్గురు ముసుగులు ధరించి ఏటీఎంలోకి చొరబడగా, మరొకరు ఏటీఎం పక్కన మరొకరు సెక్యూరిటీగా ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంలోని సీసీ కెమెరాలకు నల్లని రంగును స్పే చేసి, గ్యాస్‌కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. కాగా, బ్యాంక్ సిబ్బంది బుధవారం ఏటీఎంను పరిశీలించి అందులో ఉన్న నగదును తీసుకెళ్లారు. ఏటీఎం నుంచి ఖాతాదారులు డ్రా చేసిన వివరాలను బ్యాంక్ సిబ్బంది సేకరించినట్లు తెలిసింది. దొంగలు ఏటీఎంలోని నగదును తీసే క్రమంలో కొన్ని నోట్లకు మంటలు అంటుకొని కాలిబూడిదైనట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. కాలిపోయిన నగదు రూ.5లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేసినట్లు సమాచారం. చోరీకి ముందు ఏటీఎంలో రూ.25 లక్షలకు పైగా నగదును జమ చేసినట్లు తెలిసింది. మూడేళ్ల క్రితం ఇదే మాదిరిగా మెండోరాలోని దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో దొంగలు గ్యాస్‌కట్టర్‌తో లాకర్స్ తీస్తున్నటప్పుడు పెద్ద మొత్తంలో నగదు కాలిపోయింది.
గాలింపు ముమ్మరం
ఏటీఎం దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా మూడు బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిసింది. అందులో భాగంగా క్లూస్‌టీం ఆధారాలను సేకరించింది. కాగా, ఈ కేసును సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. ఏటీఎంలో జరిగిన చోరీ ఆధారంగా పాత నేరస్తుల లేదా కొత్త నేరస్తులా లేకుంటే మహారాష్ట్ర దొంగల ముఠా పనే అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా ముంబై మెయిన్ బ్రాంచీ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు పెట్రోలింగ్ వాహనం సైరన్ మోగించుకుంటూ రావడంతోనే దొంగలు అప్రమత్తమై పరారైనట్లు నగరంలో చర్చ జరుగుతోంది.