
ఉద్యాన పంటలకు రాయితీలు
అదనపు ఆదాయం..
ఆర్మూర్: జిల్లాలో కూరగాయలు, పండ్లు, పూల తోటలు పండించే రైతులకు ఉద్యానశాఖ (హార్టికల్చర్) అధికారులు రాయితీలు అందజేసి ప్రోత్సహిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతమైన జిల్లాలో రైతులను ఉద్యాన పంటలవైపు ప్రోత్సహిస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ఉద్యాన శాఖ తోడ్పాటును అందిస్తోంది. జిల్లా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.
యాౖౖభై శాతం సబ్సిడీపై...
జిల్లాలో వర్షాకాలంలో సుమారు 800 ఎకరాల్లో, ఎండాకాలంలో సుమారు రెండు వేల ఎకరాల్లో కూరగాయల పంటలను రైతులు పండిస్తున్నారు. ఇలాంటి రైతులకు సాగును బట్టి రాయితీలను అధికారులు అందిస్తున్నారు. తీగ జాతి (బీర, కాకర, దొండ, పొట్లకాయ, సోరకాయ) లాంటి కూరగాయల పెంపకం కోసం పందిరి సాగు చేసుకోవాలనుకొనే రైతులకు 50 శాతం రాయితీని అందిస్తున్నారు. ఒక రైతు కనీసం అర ఎకరం సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అర ఎకరానికి ఉద్యాన శాఖ వారు గరిష్టంగా రూ.50 వేలకు మించకుండా రాయితీని అందజేస్తున్నారు. అదేవిధంగా టమాట, వంగ, మిరప నారును జీడీమెట్లలోని సెంటర్‌ఆఫ్ ఎక్ట్సెన్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా అందజేస్తున్నారు. ఒక ఎకరానికి ఎనిమిది వేల మొక్కలను తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కో రైతు రెండున్నర ఎకరాల్లో ఈ కూరగాయలను పండించడానికి నారును తీసుకోవచ్చును. అదేవిధంగా ఉద్యాన పంటలో వేసుకొనే మల్చింగ్ (కప్పు) కోసం 50 శాతం రాయితీ అంటే ఎకరానికి రూ.6400 రాయితీని రైతులకు అందిస్తున్నారు. ఒక్కో రైతు ఐదు ఎకరాల్లో పంటపైన కప్పు కోసం రాయితీ తీసుకోవచ్చును. ఇక మామిడి, జామ, సీతాఫలం, పపాయ, డ్రాగన్ ఫ్రూట్ లాంటి పండ్ల తోటలు, బంతి, చామంతి, గల్లార్డియా లాంటి ఇతర పూల తోటల సాగును ప్రోత్సహించడానికి ఉద్యానశాఖ వారు 40 శాతం రాయితీని అందజేస్తున్నారు. ఒక్కో రైతు గరిష్టంగా ఐదు ఎకరాల్లో పంట పండించడానికి రాయితీని పొందవచ్చును. ఈ రాయితీలను సద్వినియోగం చేసుకొని రైతులు ఉద్యాన పంటల సాగును లాభదాయకంగా మార్చుకోవాలి.
సాంప్రదాయ పంటలతో పాటు అదనపు ఆదాయాన్ని పొందాలనుకొనే రైతులు కూరగాయలు, పండ్లు, పూల తోటలను సైతం పెంచడానికి ఉద్యానశాఖ తోడ్పాటును అందిస్తోంది. ఆసక్తి గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదనపు సమాచారం కోసం 8977713980 నంబర్‌ను సంప్రదించాలి.
– కే సంధ్యరాణి, హార్టికల్చర్ ఆఫీసర్, ఆర్మూర్
కూరగాయలు, పండ్లు, పూలతోటల
సాగులో పందిరి నిర్మాణానికి సబ్సిడీలు
జిల్లా రైతులు సద్వినియోగం
చేసుకోవాలని సూచిస్తున్న
హార్టికల్చర్ శాఖ అధికారులు

ఉద్యాన పంటలకు రాయితీలు