
జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా పనిచేయాలి
సుభాష్‌నగర్: జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్) మధుసూదన్ సూచించారు. నగరంలోని పవర్‌హౌజ్ కంపౌండ్‌లోగల సమావేశ మందిరంలో మంగళవారం ఎస్‌ఈ, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని సూచించారు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు డిపార్ట్‌మెంట్ వాహనంలో తరలించి త్వరితగతిన సమయంలో అమర్చాలని ఆదేశించారు. వినాయక చవితి, దుర్గామాత పండుగల నేపథ్యంలో విగ్రహాల తరలింపు, ఊరేగింపులో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్నిరకాల చర్యలు చేపట్టాలన్నారు. చీఫ్ ఇంజనీర్ (వరంగల్) అశోక్, ఎస్‌ఈ రాపల్లి రవీందర్, డీఈలు రమేష్, శ్రీనివాస్, రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలి
సుభాష్‌నగర్: విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రాపల్లి రవీందర్ ఆదేశించారు. సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తా, తదితర ప్రాంతాల్లో కేబుల్ వైర్లను తొలగించారు. ఈసందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. గతేడాది నుంచి విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని ఆపరేటర్లకు విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. దీని ద్వారా విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, కేబుల్ వైర్లను రీఅలైన్‌మెంట్ చేసుకోవాలని ఆదేశించారు. లేకుంటే తామే తొలగిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా వినాయక, దుర్గామాతా విగ్రహాల తరలింపు, ఊరేగింపు సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. అంతకుముందు సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి 16 సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాద ఘటనను ఉదహరించారు. వినాయక, దుర్గామాత మండపాల నిర్వాహకులతో మాట్లాడి విద్యుత్ పట్ల జాగ్రత్త వహించేలా అవగాహన కల్పించాలని తెలిపారు.

జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా పనిచేయాలి