
లక్ష్యం మేరకు ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో నిర్ధేశిత లక్ష్యం మేరకు ఆయిల్‌పామ్ సాగు జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 3500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం కాగా, ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఆయన వ్యవసాయ శాఖ వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో ఆయిల్‌పామ్ సాగుపై సమావేశం నిర్వహించారు. ఆయిల్‌పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లాలో 5630 ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు జరిగిందని, ఈ సంవంత్సరం 1500 ఎకరాలలో ఆయిల్‌పామ్ గెలలు కోతకు వచ్చాయని తెలిపారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు రకాల సబ్సిడీలను అందిస్తోందన్నారు. ఆయిల్‌పామ్ మొక్కలకు 90 శాతం రాయితీని ప్రభుత్వం భరిస్తుందని, రైతు కేవలం ఒక ఎకరానికి 1000 రూపాయల చొప్పున జిల్లా ఉద్యాన పట్టుపరిశ్రమ అధికారి, నిజామాబాద్ పేరిట డీడీ చెల్లిస్తే 50 మొక్కలు ప్రీ యూనిక్ కంపెనీ వారిచే అందిస్తామని తెలిపారు. అంతర పంటల సాగు చేపట్టే రైతులకు ఎకరానికి రూ. 4200 చొప్పున రైతు ఖాతాలో సంవత్సరానికి ఒకసారి జమ చేస్తారని వివరించారు. చిన్న, సన్నకారు, ఐదెకరాల లోపు విస్తీర్ణం ఉన్న వారికి 90 శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీ రైతులైతే 100 శాతం రాయితీ, 5 ఎకరాల పైబడి విస్తీర్ణంలో సాగు చేసే వారు 80 శాతం రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. ఈ విషయాలను రైతులకు వివరించి ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. డీఏవో గోవిందు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ప్రీ యూనిక్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.