ఉప్పొంగిన నదులు | - | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన నదులు

Aug 19 2025 4:34 AM | Updated on Aug 19 2025 5:26 AM

శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ గేట్ల ఎత్తివేత

ఎస్సారెస్పీ నుంచి విడుదలవుతున్న నీరు

జలాశయాలకు వరద పోటెత్తింది. శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్టులకు అనూహ్యంగా ఇన్‌ఫ్లో పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు 62వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో 90 వేల క్యూసెక్కులకు చేరింది. 1.30 గంటల ప్రాంతంలో గేట్లను ఎత్తివేశారు. మరోవైపు ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫ్లో లక్షా 52వేలకు పెరగడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. సోమవారం 39 వరద గేట్లను ఎత్తారు. రాత్రి వేళ ఒక గేటును మూసివేశారు. 38 గేట్ల ద్వారా లక్షా 32వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వెళ్తోంది.

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌ గుప్తా, ఈఈ చక్రపాణి వరద గేట్ల ద్వారా నీటి విడుదలను సోమవారం ప్రారంభించారు. ఆదివారం ఉదయం నుంచి లక్షా 52 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, రాత్రికి 10 గంటల సమయానికి లక్షా 43 వేలకు పడిపోయింది. అర్ధరాత్రి తరువాత లక్షా 52 వేలకు పెరగడంతో ప్రాజెక్ట్‌ నిండుకుండల మారింది. నీటి నిల్వ 73 టీఎంసీలు దాటగానే గేట్లను ఎత్తారు. ముందుగా 9 వరద గేట్లను క్రమంగా ఎత్తి 25 వేల క్యూసెక్కులు వదిలారు. ఆ తరువాత 16, మధ్యాహ్నం ఒంటి గంటకు మొత్తం 24 గేట్లను ఎత్తి నీటి విడుదలను 75 వేల క్యూసెక్కులకు పెంచారు. 2 గంటల సమయానికి 34 వరద గేట్లను ఎత్తి లక్షా 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సాయంత్రం 4 గంటలకు మొత్తం 39 వరద గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. రాత్రి 8గంటల సమయంలో ఒక గేటును మూసివేశారు. 38 గేట్ల ద్వారా లక్షా 32వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. ఎస్‌ఈ శ్రీనివాస్‌ గుప్తా మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర ద నీటి ఆధారంగా గోదావరిలోకి నీటి విడుదలను చేపడుతామన్నారు. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఈ జగదీశ్‌, ఏఈఈ రవి, సిబ్బంది పాల్గొన్నారు.

నీటి విడుదల

వరద కాలువకు నీటి విడుదల పెరిగింది. ఆదివా రం 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు.. సోమవారం ఉదయం 15 వేలకు ఆ తరువాత 18 వేల క్యూసెక్కులకు పెంచారు. కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా మిషన్‌ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఆవిరి రూపంలో 636 క్యూసెక్కుల నీరు పోతోంది.

36 మెగావాట్ల విద్యుదుత్పత్తి..

కాకతీయ కాలువకు 5 వేల క్యూసెక్కులు, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండటంతో నాలుగు టర్బయిన్‌ల ద్వారా 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని జెన్‌కో డీఈఈ శ్రీనివాస్‌ తెలిపారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో ఒక్కో టర్బయిన్‌ ద్వారా 9 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది.

తగ్గిన వరద..

ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. లక్షా 52 వేలు కొనసాగిన వరద సోమవారం రాత్రి సమయానికి లక్షా 17 వేల 148 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం రాత్రి 1088.90(72.99 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

పక్షం రోజుల ముందే..

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పక్షం రోజుల ముందే ఎస్సారెస్పీ గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. గతేడాది సెప్టెంబర్‌ 2వ తేదీన గేట్లను ఎత్తారు. 2018 నుంచి ప్రతి ఏడాది ప్రాజెక్ట్‌కు భారీ ఇన్‌ఫ్లో వస్తుండడంతో గేట్లను ఎత్తుతున్నారు. 2018, 2022, 2023 సంవత్సరంతోపాటు ఈ ఏడాది ఆగస్టులోనే గోదావరిలోకి నీటిని విడుదల చేశారు.

నిజాంసాగర్‌ 13 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్‌(జుక్కల్‌): వరద పోటెత్తడంతో ఆదివారం అర్ధరాత్రి నిజాంసాగర్‌ 13 గేట్లను ఎత్తారు. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతోపాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతుండటంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. వరద తాకిడితో నిజాం సాగర్‌ ప్రాజెక్టు ప్రమాదకర స్థాయికి చేరుకోగా అధికారులు అప్రమ త్తమయ్యారు. అర్థరాత్రి ఒంటి గంట న్నర కు నిజాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. 13 గేట్ల ద్వారా 85 వేల క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూ ర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1403. 50 అడుగుల (15.667 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

36 ఏళ్ల తర్వాత..

నేడు నిజాంసాగర్‌

20 గేట్లకు ట్రయల్‌రన్‌

32.2 మి.మీ. వర్షపాతం

సుభాష్‌నగర్‌: జిల్లావ్యాప్తంగా శనివారం 32.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రుద్రూర్‌ మండలంలో 162.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గత ఐదారు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వర్షాకాలం సీజన్‌ ప్రారంభమై మూడు నెలలు పూర్తి కావొస్తున్నా.. కేవలం డొంకేశ్వర్‌, ఇందల్వాయి, కోటగిరిల్లో మాత్రమే అత్యధిక వర్షం కురిసింది. 20 మండలాల్లో సాధారణ, 10 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజులపాటు జిల్లాకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ప్రాజెక్టులకు పోటెత్తిన వరద

ఆదివారం అర్ధరాత్రి నిజాంసాగర్‌..

సోమవారం ఉదయం ఎస్సారెస్పీ

నుంచి నీటి విడుదల

నిజాంసాగర్‌: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో ముప్‌పై ఆరేళ్ల తర్వాత నిజాంసాగర్‌ ప్రాజెక్టు చివరన ఉన్న 20 గేట్లను తెరవనున్నారు. మంగళవారం ఈ గేట్లను ఎత్తి ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. ప్రాజెక్టుకు మూడు చోట్ల కలిపి 48 గేట్లున్నాయి. నిజాంసాగర్‌కు ఒకవైపు 12, మధ్యలో16, ఇంకోవైపు 20 గేట్లున్నాయి. సాధారణంగా మధ్యలో ఉన్న 16 గేట్లను, అవసరానుగుణంగా ఒకవైపు ఉన్న 12 గేట్లను ఎత్తుతుంటారు. 20 గేట్లను భారీ ఇన్‌ఫ్లో వచ్చినప్పుడు మాత్రమే ఎత్తుతారు. 1988 సంవత్సరంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కులు, 1989 సంవత్సరంలో 4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ సమయంలో ఈ 20 గేట్లను ఎత్తి నీటిని మంజీర నదిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం భారీ వరద వస్తుండడంతో డ్యాం సేఫ్టీ దృష్ట్యా ఈ 20 గేట్లను ఎత్తాలని నిర్ణయించారు. ఒక్కో గేటును 5 ఫీట్ల మేర లేపి, నీటిని దిగువకు వదులుతూ ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్‌ తెలిపారు. నిపుణుల బృందం గేట్ల పనితీరును పరిశీలిస్తుందన్నారు. నీటి విడుదల నేపథ్యంలో నది పరీవాహక ప్రాంతంలో బోర్లు, పైపులైన్లు, కరెంట్‌ వైర్లు కలిగి ఉన్న రైతులు వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

చెరువులు, వాగులకు జలకళ

ఉప్పొంగిన నదులు1
1/1

ఉప్పొంగిన నదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement