
యూరియా పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం
సుభాష్‌నగర్: యూరియాను పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్, సంచాలకులు గోపి తదితరులతో కలిసి వారు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. యూరియా నిల్వలు, పంపిణీ తీరుతెన్నులను సమీక్షించి కలెక్టర్‌కు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ, ఇతర శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాలు నియమించి యూరియా దుర్వినియోగం కాకుండా నిఘా ఉంచాలని మంత్రి తుమ్మల సూచించారు. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో ఇదే సమయానికి లక్ష మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కువగా పంపిణీ చేశామని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రావాల్సి ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న ఎరువులను, ప్రత్యేకించి యూరియా నిల్వలు సజావుగా పంపిణీ చేసేలా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల వారీగా ఉన్న యూరియా నిల్వలను నిరంతరం పరిశీలించి, అవసరమున్న ప్రాంతాలకు సర్దుబాటు చేయాలని సూచించారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించకుండా తనిఖీలు చేయాలని మంత్రి ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలకు తరలకుండా చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసు శాఖ క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.
సరిహద్దులు దాటొద్దు
జిల్లాలో ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి స్పష్టంచేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సీపీ సాయి చైతన్యతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఒక్క బస్తా కూడా జిల్లా సరిహద్దులు దాటకుండా గట్టి నిఘా సారించాలన్నారు. ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డీఏవో జె గోవిందు, డీసీవో శ్రీనివాస్, ఇండస్ట్రీస్ జిల్లా జనరల్ మేనేజర్ సురేశ్ కుమార్, డీఎంవో గంగుబాయి, ఆర్టీవో ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయేతర అవసరాలకు
వినియోగిస్తే కఠినచర్యలు
వీసీలో వ్యవసాయశాఖమంత్రి
మంత్రి తుమ్మల, సీఎస్