
చేపలవేటకు వెళ్లి ఒకరి మృతి
నస్రుల్లాబాద్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీట మునిగి మృతి చెందిన ఘటన దుర్కి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన గుడిసె రాజు(28) సోమవారం ఉదయం నస్రూల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలోని మాంధారి చెరువు అలుగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. భారీ వర్షాల ధాటికి అలుగు 765డీ మీదుగా పారుతోంది. జాతీయ రహదారి పనుల్లో భాగంగా అలుగు కోసం మొరం కింద నుంచి పైపులు వేశారు. వరద ఉధృతికి మొరం కొట్టుకుపోయింది. రహదారి ఎగువ భాగాన దిగిన రాజు నీట మునిగిపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో తోడుగా వచ్చిన వ్యక్తి కుటుంబీకులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామస్తులు గజ ఈతగాళ్లతో గాలించగా పైపులైన్‌లో మృతదేహం లభించింది. కాగా, రహదారి పనులు నెమ్మదిగా జరగడంతోనే రాజు మరణించాడని ఆరోపిస్తూ కుటుంబీకులు, గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. మృతుడికి ఓ కూతురు ఉంది.
అదుపు తప్పిన స్కూటీ...
నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి క్రాస్‌రోడ్ వద్ద స్కూటీ అదుపు తప్పి ఓ యువతి సైడ్ డ్రెయిన్‌లో పడిపోయింది. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి సబ్‌స్టేషన్ ఎదుట ఉన్న తాత్కాలిక మట్టిదారి పూర్తిగా కొట్టుకుపోయింది. సోమవారం ఉదయం డ్రెయిన్ దాటుతుండగా యువతి స్కూటీతో సహా అందులో పడిపోయింది. రోడ్డు పనులు చేస్తున్న కూలీలు గమనించి ఆమె పైన ఉన్న వాహనాన్ని తీసి కాపాడారు.
నిజామాబాద్‌నాగారం: జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు జిల్లాకు చెందిన క్యూరియస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు మయాంక్ తేజ్, శీతల్ ఎంపికై నట్లు కోచ్ వినోద్ నాయక్ తెలిపారు. హైదరాబాద్‌లో ఈ నెల 17న నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారన్నారు. ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఒడిశా రాష్ట్రంలోని కటక్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీలో మయాంక్ తేజ్, శీతల్ పాల్గొననున్నారు. ఎంపికై న క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ డా. రమేశ్ పవార్, ప్రెసిడెంట్ అజ్మత్ ఖాన్, ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్, అసోసియేషన్ సభ్యులు అభినందించారు.
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ షటిల్ బాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఫిట్ నెస్ క్లబ్‌లో ని ర్వహించిన జిల్లాస్థాయి పోటీ ల్లో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో క్రీడాకారులు పాల్గొంటారని అధ్యక్షుడు కర్నాటి వాసు, సెక్రెటరీ కేవీ కిరణ్ కుమార్ తెలిపారు.
పోలీసు బందోబస్తు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెండోరా ఎస్సై సుహాసిని ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆనకట్ట దిగువనే వాహనాలను నిలిపి వేశారు. గోదావరి వైపు వెళ్లకుండా బారికేడ్లను పెట్టారు. గోదావరి వైపు పర్యాటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బందోబస్తును ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షించారు.

చేపలవేటకు వెళ్లి ఒకరి మృతి

చేపలవేటకు వెళ్లి ఒకరి మృతి

చేపలవేటకు వెళ్లి ఒకరి మృతి