
సోలార్ ప్లేట్ల ఏర్పాటుకు నివేదికలు సమర్పించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
సుభాష్‌నగర్: ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలపై సోలార్ విద్యుత్ ప్లేట్ల ఏర్పాటుకు మంగళవారం సాయంత్రంలోపు ఆయా శాఖల వారీగా నివేదికలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు విషయమై అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాలు, గురుకులాల భవనాలతోపాటు నీటి పారుదల, మిషన్ భగీరథ శాఖలకు చెందిన ఖాళీ స్థలాల్లో సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అందులో భాగంగా ఆయా శాఖల అధికారులు సౌర విద్యుత్ పలకల ఏర్పాటుకు వీలున్న ప్రభుత్వ కార్యాలయాల భవనాల పూర్తి వివరాలను నిర్దేశిత నమూనాలో పొందుపరుస్తూ, మంగళవారం సాయంత్రంలోపు సమర్పించాలని సూచించారు. సౌర విద్యుత్ పలకల ఏర్పాటుకు కావలసిన వైశాల్యం, విద్యుత్ కనెక్షన్ తదితర వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
చేపపిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టి
సుభాష్‌నగర్: మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు నాణ్యమైన చేపపిల్లల పెంపకంపై దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో మత్స్యశాఖ పనితీరుపై ఆయన సమీక్షించారు. మత్స్య అభివృద్ధి పథకం కింద 2024–25 సంవత్సరానికి వంద శాతం సబ్సిడీపై 799 చెరువులు, రిజర్వాయర్లలో కోటీ 92 లక్షల చేపపిల్లలను విడుదల చేశామన్నారు. ఈ ఏడాది 967 చెరువుల్లో 4.5 కోట్ల చేపపిల్లలను వదలాలని నిర్దేశించిన నేపథ్యంలో నాణ్యమైన చేపపిల్లల పెంపకానికి చొరవ చూపాలన్నారు. కట్ల, రాహు, బంగారు తీగ రకాల చేప పిల్లలను పెంచుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని 398 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని 24,071 కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా తోడ్పాటును అందించాలని సూచించారు. మత్స్య కార్మిక సంఘాల సభ్యులు అందరూ ఎన్‌ఎఫ్‌డీపీ పథకం కింద ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు చేసుకునేలా చూడాలని అన్నారు. డిచ్‌పల్లి, అర్సపల్లి ప్రాంతాల్లో నూతనంగా మంజూరైన చేపల మార్కెట్ సముదాయాల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టి, పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.