
ప్రజావాణికి 52 ఫిర్యాదులు
సుభాష్‌నగర్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఫిర్యాదుదారులు లేక ప్రజావాణి వెలవెలబోయింది.
ఆర్‌సీవో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి
గురుకులాలకు సంబంధించిన ఆర్‌సీవో కార్యాలయాలను జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశా రు. అనంతరం రాజేశ్వర్ మాట్లాడుతూ మూడు జి ల్లాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గు రుకులాల ఆర్‌సీవో కార్యాలయాలు రూరల్ ప్రాంతంలో ఉన్నాయన్నారు. అందరికీ అందుబాటు లో ఉండేలా చూడాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. నాయకులు మనోజ్, సాయికిరణ్, రాకేశ్ పాల్గొన్నారు.