
చెరువు నిండదు.. పంట పండదు!
తిప్పలు పడుతున్నాం
● సోన్‌పేట్ చెరువు దుస్థితి
● ఎగువనే ఎస్సారెస్పీ ఉన్నా అందని నీరు
● నీరు లేక సాగు చేయని వైనం
బాల్కొండ: తలపునే సముద్రం ఉన్నా తాగడానికి చుక్క నీరు పనికి రాదన్న చందంగా ఉంది మెండోరా మండలం సోన్‌పేట్ గ్రామస్తుల దుస్థితి. గ్రామ చెరువు వర్షపు నీటి ఆధారంగా నిండుతుంది. ప్రస్తుతం చెరువు సగం మాత్రమే నిండింది. దీంతో పొలాలకు నీటి సరఫరా చేసేందుకు నిర్మించిన తూంకు నీరు అందడం లేదు. దీంతో చెరువు నీటి ఆధారంగా సాగు చేసే సుమారు 300 ఎకరాలు బీడుగానే ఉంది. వర్షాలు కురుస్తాయని పంటలు సాగు చేస్తామని ఆశతో రైతులు నారు పోశారు. కానీ నారు ముదిరి పోయింది. ప్రస్తుతం నీరు వచ్చినా నారు పనికి రాదని రైతులు పేర్కొంటున్నారు.
ఎగువనే ఎస్సారెస్పీ..
ఎస్సారెస్పీ గ్రామ చెరువుకు 300 మీటర్ల దూరంలోనే ఉంది. కానీ ప్రాజెక్ట్ నుంచి సోన్‌పేట్ చెరువుకు చుక్క నీరు రాదు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సగం ఆ గ్రామ భూములేనే అప్పగించారు. కానీ ఆ గ్రామానికే ప్రాజెక్టు నుంచి చుక్క నీరు లేదు. ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా చేసే లక్ష్మికాలువ ఆధారంగా సుమారు 65 చెరువులను నింపుతారు. కానీ ఇక్కడ అలాంటి అవకాశం కూడా లేదు. బుస్సాపూర్ వరకు లక్ష్మి కాలువ నీరు సరఫరా అవుతుంది. అక్కడి నుంచి ఫీడర్ చానల్ నిర్మించి చెరువులకు నీటి సరఫరా చేపట్టవచ్చు. కానీ పాలకులు ఆ వైపుగా దృష్టి సారించడం లేదు. దీంతో సోన్‌పేట్ గ్రామస్తులు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
చెరువు కింది ఆయకట్టుకు ఏటా నీటి కోసం తిప్పలు పడుతున్నాం. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సర్వం భూములను కోల్పోయినా మాకు మాత్రం చుక్క నీరు ప్రాజెక్ట్ నుంచి రావడం రాదు. వర్షం నీటిపైనే ఆధారం. చెరువులో నీరు లేక ఇప్పటి వరకు నాట్లు వేయలేదు. అధికారులు స్పందించాలి.
– ప్రకాశ్, మాజీ సర్పంచ్, సోన్‌పేట్

చెరువు నిండదు.. పంట పండదు!