
మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం
ఇందల్వాయి: మండలంలోని పలు గ్రామాల్లో దుండగులు శనివారం రాత్రి మూడు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్‌ను ఎత్తుకెళ్లారు. నల్లవెల్లి శివారులో గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి, గన్నారం గ్రామానికి చెందిన సామల రాజేశ్, మెగ్యానాయక్ తండాకు చెందిన లంబాని రెడ్య అనే రైతులకు చెందిన మూడు ట్రాన్స్‌ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు విషయం గమనించి లైన్‌మన్ నవీన్‌కి సమాచారం అందించారు. లైన్‌మన్ పంచనామా నిర్వహించి జరిగిన నష్టంపై పై అధికారులకు నివేదిక అందించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు.
మద్నూర్(జుక్కల్): మండలంలోని పెద్దతడ్గూర్‌లో ఆదివారం పిచ్చికుక్కలు దాడి చేసిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో నడుచుకుంటు వెళ్తున్న సంజయ్, విఠబాయి, అనిల్, దాదారావు, నారాయణ, గంగాధర్‌లపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో స్థానికులు గాయాలపారైన వారిని మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయని కనిపించిన వారందరిని గాయపరుస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నవీపేట: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి మునిగి ఒకరు మృతి చెందిన ఘటన నవీపేట మండలం లక్ష్మాపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మాపూర్‌కు చెందిన గుడిమెట్ల శంకర్(45) రెండు రోజుల క్రితం గ్రామ సమీపంలోని చింతల చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం శంకర్ మృతదేహం లభ్యమైందన్నారు. మృతుడి కుమారుడు కార్తిక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం