
‘తక్షణ స్పందన.. ప్రాణాలకు రక్షణ’
ఖలీల్‌వాడి: ‘ఒక్క గంట ముందు వచ్చి ఉంటే ప్రాణాలు కాపాడేవాళ్లం’ అనే మాటలు డాక్టర్ల వెంట తరచూ వింటూ ఉంటాం. రోడ్డు ప్రమాదాలు, విద్యుదాఘాతాలు, పాముకాట్లు తదితర ఘటనలు జరిగిన తర్వాత తక్షణమే స్పందించకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం, జీవితాంతం క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. ఎలాంటి ప్ర మాదం జరిగినా సమీపంలో ఉండే వారు తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపడితే ప్రాణాలు నిలిపే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
గోల్డెన్ అవర్
జిల్లాలో గత మూడేళ్లలో సుమారు 944లకు పైగా రోడ్డు ప్రమాదాలు సంభవించగా ఇందులో 1012 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో 2183 మందికి పైగా క్షతగాత్రులుగా మిగిలారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని గంటలోపే ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకా శం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్తస్రా వం, ఎముకలు విరగడం లాంటివి జరిగినప్పుడు అంబులెన్స్ కోసం వేచిచూడకుండా ఇతర మార్గాల ద్వారా ఆస్పత్రికి తరలించాలని సూచిస్తున్నారు.
సీపీఆర్..
రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు బాఽధితులకు పక్క న ఉండేవారు సీపీఆర్(కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేసి ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. సీపీఆర్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రథమ చికిత్సే ప్రధానం..
చాలా ప్రమాదాల సమయంలో ప్రథమ చికిత్సలు ప్రాణాలను కాపాడుతాయి. ఇటీవల వీధి కుక్కలు దాడి చేసి పిల్లలు, పెద్దలను గాయపర్చిన ఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. కుక్క కరిచిన చోట సబ్బుతో బాగా శుభ్రం చేసి కట్టుకట్టాలి. అనంతరం ఆస్పత్రికి తరలించి తగిన చికిత్స పొందాల్సి ఉంటుంది.
వర్షాకాలంలో రైతులు పాముకాటుకు గుర య్యే అవకాశం ఉంటుంది. పాము కరిచిన వెంటనే కాటు వేసిన ప్రాంతంలో దారంతో గట్టిగా కట్టాలి. దీంతో పాము విషం శరీరంలోకి వ్యాప్తి చెందే అవకాశం తగ్గుతుంది. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
రోడ్డు ప్రమాదాల్లో తొలి గంటే కీలకం
సీపీఆర్, ప్రథమ చికిత్సతో ప్రాణాలు నిలిపే అవకాశం
ఆస్పత్రికి తరలించాలి
ఎలాంటి ప్రమాదం జరిగినా సమీపంలో ఉన్నవారు తక్షణమే స్పందించి ఆస్పత్రికి తరలించాలి. క్షతగాత్రుడిని త్వరగా తీసుకువస్తే ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ శంభు, ఎంఎస్ ఆర్థోపెడిక్, నిజామాబాద్