
బీసీలు ఐక్యతతో ముందుకు సాగాలి
నిజామాబాద్‌రూరల్/డిచ్‌పల్లి: ఐక్యతతో ముందుకు సాగాలని, 2029లో బీసీలదే రాజ్యాధికారమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం డిచ్‌పల్లి మండలం బర్దీపూర్ శివారులోని హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. బీసీ ఉద్యమానికి నిజామాబాద్ జిల్లా నాంది పలుకుతుందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే టికెట్లను అధికంగా అగ్రవర్ణాల వారికి కేటాయించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో 25 లక్షలకు పైగా బీసీ జనాభా ఉంటే ఒక్క బీసీ ఎమ్మెల్యే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీసీకి చెందిన గంప గోవర్ధన్ ఉండగా, ఆ ఒక్క సీటును కేసీఆర్ లాక్కున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి 42 శాతం బీసీల రిజర్వేషన్ పేరిట డ్రామా ఆడుతూ, ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీసీలు కలిసికట్టుగా ఉండాలి
బీసీ ఓట్లతో గెలిచి సీఎంగా రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, 15శాతం ఉన్న ఓసీలకు చిత్తశుద్ధి ఉంటే సీఎంతో సహా అందరూ రాజీనామా చేసి బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని మల్లన్న డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీ స్థానాలను సాధించుకునేలా బీసీలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్, సమన్వయకర్తలు వట్టె జానయ్య యాదవ్, భీమగాని సిద్ధులుగౌడ్, సంగెం సూర్యారావు, బుస్సాపూర్ శంకర్, బీసీ జేఏసీ నాయకులు బాస రమేశ్ యాదవ్, రమేశ్ పటేల్, డి.నరేందర్, సతీశ్ గౌడ్, తాళ్లపల్లి చంద్రశేఖర్, ప్రవీణ్ ముదిరాజ్, జ్యోతి, రేఖ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ల పేరిట సీఎం
రేవంత్‌రెడ్డి డ్రామా
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న