
ఆశలు నింపిన వాన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆశలు నింపాయి. మొన్నటి వరకు అంతంత మాత్రమే పడడంతో సాగు, తాగునీటిపై కొంత భయం ఉండేది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆ ఆందోళన అక్కర్లేదనే నమ్మకం ఏర్పడింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆగకుండా కురిసిన వర్షంతో జిల్లా వ్యాప్తంగా మెరుగైన వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. పలుచోట్ల అలుగులు, వాగులు పారుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో నీటి నిల్వ 55 టీఎంసీలు దాటింది. సగం చెరువులు నిండేస్థాయికి చేరుకోవడంతో సాగు, తాగునీటికి ఢోకా లేదని చెప్పవచ్చు. ఇటు భూగర్భజలాల పెరుగుదలకు వర్షాలు దోహదపడుతున్నాయి. వర్షాధార పంటలకూ మే లు జరుగుతోంది. ఐతే, వాతావరణ శాఖ చెప్పిన దాని కంటే ఆలస్యంగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. అంచనాలు అదుపు తప్పడంతో వర్షం ఎప్పుడెలా వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం 8గంటల వరకు వర్షపాతం జిల్లా వ్యాప్తంగా 2సెంటీమీటర్లు నమోదు కాగా, రోజంతా కురిసిన వానకు మరింత వర్షపాతం రికార్డు కానుంది. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచాయి. రుద్రూర్ మండలం బొప్పాపూర్ వద్ద రోడ్డుపై గుండ్ల వాగు ప్రవహిస్తోంది. జిల్లాకు వర్షసూచన ఇంకా ఉన్నందున ప్రజలు వరద ప్రవహించే ప్రాంతాలతోపాటు జలపాతాల వద్దకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
కలెక్టర్ పరిశీలన
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేప థ్యంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం లోత ట్టు ప్రాంతాల్లో పర్యటించారు. నిజామాబాద్ నగరంతోపాటు బోధన్ పట్టణం, వర్ని మండలం జలాల్‌పూర్‌లో అధికారులతో కలిసి తిరిగారు.
డివిజన్ చెరువులు 25 శాతం 25–50 శాతం 50–75 శాతం 75–100 శాతం అలుగు
నిండినవి నిండినవి నిండినవి నిండినవి పారుతున్నవి
బోధన్ 182 02 21 121 20 18
నిజామాబాద్ 324 163 117 29 11 04
ఆర్మూర్ 196 47 63 53 27 08
బాల్కొండ 292 79 128 79 06 -
బాన్సువాడ 90 - 16 25 18 31
మొత్తం 1,084 291 345 307 82 61
ఇప్పటి వరకు 48 సెంటీమీటర్లు
ఈ ఏడాది వర్షాకాల సీజన్‌లో ఇప్పటి వరకు జిల్లాలో 57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 48 సెంటీమీటర్లు నమోదైంది. కురుస్తున్న వర్షాలతో మరింత పెరిగే అవకాశముంది. డొంకేశ్వర్, ఇందల్వాయి మండలాలు అధిక వర్షపాతం జాబితాలో ఉండగా, 15 మండలాలు సాధారణ, 16 మండలాలు లోటులో ఉన్నాయి. ఈ కాస్త లోటును పూడ్చేందుకు ఇంకా 40 రోజుల వర్షాకాలం సీజన్ మాత్రమే ఉంది. సెప్టెంబర్ ముగిసే నాటికి జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 90 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావాలి.
జిల్లాలో చెరువుల పరిస్థితి..