
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు భరోసా
ఎస్సారెస్పీలో ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో ఆయకట్టుకు భరోసా ఏర్పడింది. స్థానిక ఎగువ ప్రాంతాలతోపాటు మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి వరద వస్తోంది. ఎస్సారెస్పీ నీటిమట్టం ప్రస్తుతం 50 టీఎంసీలు దాటింది. దీంతో ఆయకట్టులోని ఖరీఫ్ పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందించవచ్చని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా, సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులతో జలాశయంలోకి ఆశించినంతగా వరద రాలేదు. దీంతో ప్రాజెక్ట్ నుంచి ఖరీఫ్ పంటలకు కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు పాలకులు, అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 40.5 టీఎంసీలకు చేరగానే వరదలు వచ్చే అవకాశం ఉందని భావించి ప్రభుత్వం నీటి విడుదలకు పచ్చజెండా ఊపింది. ఈ నెల 7న అధికారులు నీటి విడుదల చేపట్టారు. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్ట్‌లో నీటిమట్టం వేగంగా పెరుగుతుండడంతో ఖరీఫ్‌తోపాటు రబీ సాగుపై ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
లక్షల ఎకరాలకు నీరు..
ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ ద్వారా ఎల్‌ఎండీ ఎగువ వరకు 4.60 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు అధికారులు నిర్ణయించారు. లక్ష్మీ కాలువ ద్వారా 25 వేలు, సరస్వతి కాలువ ద్వారా 35 వేలు, అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 57,763, గుత్ప ఎత్తిపోతల ద్వారా 38,967, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల ద్వారా 11,600, వేంపల్లి ఎత్తిపోతల ద్వారా 22 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
ఎస్సారెస్పీలో 50 టీఎంసీలు దాటిన నీటి నిల్వ