
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
● అర్గుల్‌లో రూ. కోటి నిధులతో
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జక్రాన్‌పల్లి: ఇందిరమ్మ రాజ్యంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. గురువారం జక్రాన్‌పల్లి మండలంలోని అర్గుల్‌లో రూ. కోటి నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించారన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ.6800 కోట్లు చెల్లించిందన్నారు. రైతులకు ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, పేదల గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, డ్వాక్రా సంఘాలకు ఒక్కో గ్రూప్ కు రూ. 15 లక్షలు వడ్డీ లేని రుణాలు, వంటి పథకాలను అమలు చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పేదలకు రేషన్ కార్డులు, ఒక్క ఇల్లు మంజూరు చేయలేదన్నారు. బీసీలకు 42 శాతం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఎంపీలు, బీసీ రిజర్వేషన్లకు అనుకూలమా, వ్యతిరేకమా, స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. అనంతరం చాకలి ఐలమ్మ ముని మనుమరాలు శ్వేతను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయి రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్, నాయకులు చిన్నారెడ్డి, చిన్న సాయి రెడ్డి, ఆర్మూర్ గంగారెడ్డి, శేఖర్, కాటిపల్లి నర్సారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యం రెడ్డి, వసంతరావు, మద్దుల రమేశ్, గోర్త పద్మ , రజక సంఘ సభ్యులు సాగర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళలను కోటీశ్వరులను చేస్తాం