
No Headline
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం
● పలువురి గైర్హాజరుపై అసహనం
నిజామాబాద్ అర్బన్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపించొద్దని, జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణిలో పాల్గొనాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో జిల్లా అధికారుల హాజరును పరిశీలించేందుకు అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు. సోమవారం ఐడీవోసీలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్‌లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 83 వినతులు అందగా, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ప్రజావాణికి పలు శాఖల జిల్లా అధికారులు గైర్హాజరు కావడం, మరికొందరు కిందిస్థాయి అధికారులను పంపించడంపై కలెక్టర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అధికారులు గైర్హాజరు కావడం సమంజసం కాదన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణిలో తప్పక ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎవరికై నా అత్యవసర పని ఉంటే, ముందుగానే తమ దృష్టికి తేవాలని సూచించారు. అనుమతి లేకుండా ప్రజావాణికి గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజావాణిలో ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్ రావు, మెప్మా పీడీ రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.