
No Headline
నిజామాబాద్ నాగారం: రాష్ట్రస్థాయి పోటీలలో పతకాలు సాధించిన జిల్లా అథ్లెట్స్, పీఈటీలతోపాటు జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన జైపాల్‌ను అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరాల రత్నాకర్ ఘనంగా సన్మానించారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో జిల్లాలో అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ నిర్మిస్తుందన్నారు. అథ్లెటిక్స్‌ని ప్రోత్సహిస్తున్న పాఠశాలల కరస్పాండెంట్లు, తల్లిదండ్రులను అభినందించారు. ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్ మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయుల సమష్టి కృషి ఫలితంగానే అథ్లెటిక్స్‌లో విజయాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మరింత ప్రోత్సహిస్తే జాతీయస్థాయిలో రాణిస్తారని తెలిపారు.
నిజామాబాద్ సిటీ: బీసీల రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో చట్టం చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రసాద్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలన్నారు. సామాజికంగా వెనుకబడిన తరగతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, పదేళ్లుగా అధికారంలో బీజేపీ ప్రభుత్వం జనాభాకనుగుణంగా కులగణన చేయలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎ.రమేశ్ బాబు, నూర్జహాన్, వెంకటేశ్, నన్నేసాబ్, గంగాధర్, బెజుగం సుజాత, జంగం గంగాధర్, విఘ్నేశ్, నాయక్‌వాడి శ్రీనివాస్, కటారి రాములు, అనసూయమ్మ, శ్రీదేవి, నరేశ్, మహేందర్, శేఖర్ గౌడ్, నరేష్, ఒడ్డన్న తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: మండలంలోని ఆకుల కొండూర్ మాజీ సర్పంచ్ అశోక్‌పై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. ఇది వరకు ఆయ నపై పది కేసులు ఉన్నాయని వాటి ఆధారంగా రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరిఫ్ తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా తమ పార్టీ నాయకులపై కేసులు పెడుతోందని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడుతున్నారు.

No Headline