
No Headline
● రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో సోమవారం నిర్వహించిన రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కేంద్రం నుంచి జీపీలు, మున్సిపాలిటీలకు నేరుగా నిధులు ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందని రాజీవ్ గాంధీ భావించారని గుర్తుచేశారు. ఆర్టికల్ 72,73 రాజ్యాంగ సవరణతో గ్రామ పంచాయతీలకే హక్కులు కల్పించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌జీపీఆర్‌ఎస్ జోనల్ ఇన్‌చార్జి మోత్కురి నవీన్, నాయకులు సురేశ్ బాబా, పొలసాని శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, ఇందూరు శేఖర్, వెంకటేశ్వర పటేల్, ఇట్టం జీవన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మాక్లూర్: మండలంలోని బోర్గాం(కె) గ్రామానికి చెందిన సంగేవార్ ప్రకాశ్(44) జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ప్రకాశ్ వృత్తి రీత్యా కుట్టుమిషన్ మెకానిక్. ఆదివారం రాత్రి సుమారు రాత్రి 11 గంటల సమయంలో మూత్ర విసర్జనకు బయటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇంటి ఎదుట ఉన్న డ్రెయినేజీలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన భార్య చికిత్స నిమిత్తం వెంటనే అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. సోమవారం చికిత్స పొందుతూ ప్రకాశ్ మృతి చెందాడు. మృతుడి భార్య సంగేవార్ లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మోపాల్: మండలంలోని గుడి తండాకు చెందిన రత్నావత్ గంగా అలియాస్ హారిక ఇంట్లో నుంచి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఎస్సై జాడె సుస్మిత సోమవారం తెలిపారు. గత నెల 27న కుమారుడి జన్మదినం సందర్భంగా బంగారు ఆభరణాలు ధరించారు. తిరిగి ఎప్పటిలాగే బీరువాలో దాచిపెట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా 8న బీరువా తెరిచి చూడగా, బంగారు ఆభరణాలు కన్పించలేదు. ఇంట్లో అంతా వెతికినా లభించకపోవడంతో చోరీకి గురైనట్లు నిర్ధారణకు వచ్చిన హారిక సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.