
నులిపురుగులను నివారిద్దాం
నిజామాబాద్‌నాగారం/బోధన్ రూరల్: నులి పురుగులతో నెలల వయసు నుంచి పెద్దల వరకు ఇబ్బందులు పడుతుంటారు. ఇవి సులువుగా పొట్టలోకి చేరి హాని కలిగిస్తున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ నెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా 1–19 ఏళ్లలోపు పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
నాలుగు లక్షలకు పైగా..
జిల్లాలో 1500 అంగన్‌వాడీ కేంద్రాలు, 1262 ప్రభుత్వ, 569 ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటితోపాటు కేజీబీవీ, మోడల్, సోషల్, బీసీ, ట్రైబల్, మైనార్టీ వెల్ఫేర్ విద్యాసంస్థలతోపాటు మదర్సాలున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో 1,10,032 మంది చిన్నారులుండగా, పాఠశాలలు, కళాశాలల్లో 2,95,411 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ సోమవారం అల్బెండజోల్ మాత్రలను వైద్య సిబ్బంది వేయనున్నారు.
మాత్రలు ఇలా వేసుకోవాలి
1– 2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్రను పొడిగా చేసి నీటిలో కలిపి వేయించాలి.
2– 3 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్రను పూర్తిగా పొడి చేసి కొద్దిగా నీటిని కలిపి వేయాలి.
3 –19 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్రను బాగా చప్పరించి, నమిలి మింగేలా చూడాలి.
భోజనం తర్వాతే ఈ మాత్ర వేయాలి. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు వేయొద్దు.
అల్బెండజోల్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో 4లక్షలకుపైగా
1–19 సంవత్సరాల పిల్లలు
నేడు జాతీయ నులిపురుగుల
నిర్మూలన దినోత్సవం