
చేపపిల్లల ఉత్పత్తి ప్రయోగం విఫలం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో చేపపిల్లల ఉత్పత్తి ప్రయోగం రెండుసార్లు విఫలమైంది. దీంతో సుమారు కోటి స్పాన్ ఉత్పత్తికి నష్టం ఏర్పడింది. ప్రస్తుత సంవత్సరం 54 లక్షల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకోగా అందుకు 2.4 కోట్ల స్పాన్ ఉత్పత్తి కావాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు 1.75 కోట్ల స్పాన్ మాత్రమే ఉత్పత్తి అవ్వగా, మిగతా స్పాన్ కోసం ఎకో హేచరీలో రెండుసార్లు ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం విఫలం కావడంతో స్పాన్ ఉత్పత్తి కావడం లేదు. దీంతో ప్రభుత్వ సొమ్ము వృథా అవుతోంది. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం కొరవడడం కూడా ఒక కారణంగా మత్స్యకారులు చెప్తున్నారు.
ఉత్పత్తిపై అనుమానాలు
చేపపిల్లల ఉత్పత్తికి జూలై, ఆగస్టు నెలలు అనుకూల సమయం. చెరువులు, ప్రాజెక్టుల్లో సహజ సిద్ధంగానే ఈ రెండు నెలల్లో చేపలు పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. కానీ, ప్రతికూల వాతావరణం కారణంగానే స్పాన్ ఉత్పత్తి ప్రయోగం విఫలమైనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో చేపపిల్లల ఉత్పత్తి అంశంపై ఉన్నతాధికారులు స్పందించాలని మత్స్యకారులు కోరుతున్నారు. 5 కోట్ల చేపపిల్లలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న కేంద్రంలో ప్రస్తుతం 10శాతం కూడా చేపపిల్లల ఉత్పత్తి జరిగేలా లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సుమారు కోటి స్పాన్‌కు నష్టం
ప్రస్తుత సీజన్‌లో రెండుసార్లు ఫెయిల్
ప్రతికూల వాతావరణమే
కారణమంటున్న అధికారులు
లక్ష్యాన్ని పూర్తి చేస్తాం
ప్రస్తుతం వాతావరణం చల్లగా లేకపోవడంతోనే రెండుసార్లు చేపపిల్లల ఉత్పత్తి ప్రయోగం విఫలమైంది. సుమారుగా కోటి స్పాన్ ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. ప్రస్తుత సంవత్సర లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ఐస్ వేసి చేపపిల్లల ఉత్పత్తి చేపడ్తాం.
– దామోదర్, మత్స్య అభివృద్ధి అధికారి, పోచంపాడ్