
ఉప్లూర్ చెరువులో మొసలి
కమ్మర్‌పల్లి: మండలంలోని ఉప్లూర్ నల్ల చెరువులో ఆదివారం ఉదయం మొసలి కనిపించడం కలకలం రేపింది. చెరువు మధ్యలో నీటిపై ఏదో కదులుతున్నట్లు కనిపించడంతో స్థానిక రైతుతు తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు. మొసలి కావడంతో గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయడంతో ఈ విషయం కలకలం రేపుతోంది. చెరువు విస్తీర్ణం పెదద్దిగా ఉండడంతో మొసలి ఎటు వైపు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. మూడు నాలుగు నెలల క్రితం కూడా చెరువులో మొసలి కనిపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి మొసలిని పట్టుకొని బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రోడ్లపై నిలుస్తోన్న వాన నీరు
● కేకేవై రహదారిలో వాహనదారులకు ఇబ్బందులు
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణం గుండా వెళ్లే కేకేవై (కరీంనగర్–కామారెడ్డి–ఎల్లారెడ్డి) వంద ఫీట్ల రోడ్డు కబ్జాలు ఒకవైపు, మరో వైపు ఉన్న రోడ్డుకు ఇరువైపులా డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో రోడ్లపై నీరు నిలుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంద ఫీట్ల కేకేవై రోడ్డు పట్టణంలో సిరిసిల్లరోడ్డు, స్టేషన్‌రోడ్డు, పోలీసు స్టేషన్, రైల్వే బ్రిడ్జి మీదుగా ఉంది. ఈ రోడ్డులో ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలతో కబ్జా చేశారు. సిరిసిల్ల రోడ్డులో కేకేవై నుంచి రామేశ్వరపల్లి వెళ్లే జాతీయ రహదారి సర్వీసు రోడ్డు సైతం ఇలాగే వాన నీటితో నిండిపోయింది. జాతీయ రహదారి నిర్వాహకులు మూసుకుపోయిన మురికికాల్వల్లో మట్టిని తొలగించకపోవడంతో నీరు రోడ్డుపై నిలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట ధ్వంసం
రాజంపేట : ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుకు ఏదో ఒక రూపంలో కష్టాలు తప్పడం లేదు. రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామంలోని రాజిరెడ్డి అనే రైతు తనకున్న రెండు ఎకరాల భూమిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. శనివారం రాత్రి అడవి పందులు మొక్కజొన్న పంటపై దాడి చేసి బీభత్సాన్ని సృష్టించాయి. దీంతో మొక్కజొన్న పంట మొత్తం నేలవాలింది. అడవి పందులు రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసిన వాటి దాడుల నుంచి పంటను కాపాడుకోలేకపోతున్నామని బోరున విలపిస్తున్నారు.
తూము గండికి మరమ్మతులు
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గుజ్జుల్ డ్యాం ఎడమ కాలు తూముకు గండి పడి నీరు వృథాగా పోతున్న విషయం తెలిసిందే. నీటి పారుదల శాఖ అధికారులు రెండు రోజులుగా తూము గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం కూడ మరమ్మతు పనులు కొనసాగాయి. ఆయకట్టు పొలాల్లో నీరు చేరి పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉప్లూర్ చెరువులో మొసలి

ఉప్లూర్ చెరువులో మొసలి