
కట్టడి చేసినా.. గంజాయి సరఫరా..
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలో గంజాయి కట్టడికి పోలీసులు ఎంత ప్రయత్నం చేస్తున్నా.. స్మగ్లర్లు ఏదో ఒకవిధంగా తమ దందాను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలోగల పలు గ్రామాలకు పొరుగు జిల్లాల నుంచి గంజాయి సరఫరా కొనసాగుతోంది. నిందితులను పోలీసులు పట్టుకుంటూ, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నా స్మగ్లర్లు దందాను ఆపడం లేదు.
ఇదీ పరిస్థితి..
బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పొరుగు జిల్లాలైన జగిత్యాల్, నిర్మల్‌ల నుంచి గంజాయి స్మగ్లర్లు వచ్చి తమ దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా కమ్మర్‌పల్లిలో పోలీసులు మెట్‌పల్లికి చెందిన నాంపల్లి వికాస్‌ను అతడికి సహకరిస్తున్న స్థానికుడైన షేక్ ఇమ్రాన్‌ను అరెస్టు చేయడం పరిశీలిస్తే పొరుగు జిల్లాల నుంచి గంజాయి దిగుమతి అవుతుందని వెల్లడవుతోంది. నాంపల్లి వికాస్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడికి గంజాయి అందించేవారు ఎవరు? ఎంత మొత్తంలో సరఫరా చేస్తారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గంజాయి దందాకు కీలకమైన వ్యక్తులను పట్టుకుంటేనే ఈ దందాను పూర్తిగా అంతమొందించవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
కౌన్సెలింగ్ ద్వారానే మార్పు..
గంజాయికి బానిసలైన యువకులను గుర్తించి వారికి, వారి తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తేనే గంజాయికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో మోర్తాడ్ ఎస్సైగా పనిచేసిన సంపత్ గంజాయికి బానిసలైన వారితోపాటు వారి తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు రప్పించి అందరి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉన్నతాధికారులు స్పందించి కౌన్సెలింగ్ ద్వారానే యువతలో మార్పు తీసుకరావాలని పలువురు సూచిస్తున్నారు.
పొరుగు జిల్లాల నుంచి బాల్కొండ నియోజకవర్గ గ్రామాలకు సప్లయ్
పోలీసులు పట్టుకుంటున్నా
వెరవని స్మగ్లర్లు
ఎవరు విక్రయించినా ఉపేక్షించం
గంజాయిని ఎవరైన, ఎక్కడైన విక్రయిస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి విషయంలో మా యంత్రాంగం సీరియస్‌గా ఉంది. గంజాయి విక్రయించేవారి గురించి సమాచారం ఇస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ప్రజల సహకారంతోనే గంజాయిని నిర్మూలించడం సాధ్యమవుతుంది.
– సత్యనారాయణ,
సీఐ, భీమ్‌గల్