
విస్తృత స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి
సుభాష్‌నగర్: గ్రామ పంచాయతీ భవనం మొదలు కుని రాష్ట్ర సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, తద్వారా విద్యుత్ ఉత్పత్తి పెంచాలని రాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్‌లోని బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి శనివారం ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, రెడ్కో సీఎండీ అనిల్ తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్‌వోఎఫ్‌ఆర్ భూముల్లో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం అమలు, ఇరిగేషన్, దేవాదాయ తదితర శాఖల పరిధిలోని ఖాళీ భూములు, అవకాశమున్న చోట్ల సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు అన్నీ కూడా ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలమైన డిజైన్లను హైదరాబాద్ నుంచి ఎంపిక చేసి పంపిస్తామని తెలిపారు. ఏవైన మంచి డిజైన్లు ఉంటే, వాటిని పంపాలని సూచించారు. నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పరిధిలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయని, వాటి వివరాలు సైతం పంపాలన్నారు. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని జాప్యానికి తావు లేకుండా వారం రోజుల్లోపు వివరాలు పంపాలని సూచించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, టీజీ రెడ్కో డీఎం రమణ, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రవీందర్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లల్లో యూనిట్లు ఏర్పాటు చేయాలి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

విస్తృత స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి