
స్టేడియం ఊసేదీ..?
సౌకర్యాలు అంతంత మాత్రమే..
అంతంతమాత్రం సౌకర్యాల మధ్యే పలువురు క్రీడాకారులు ప్రతిరోజూ ప్రాక్టీస్ చేసి ఎదిగారు. పలువురు వర్ధమాన క్రీడాకారులు సైతం ఇదేరీతిలో ప్రాక్టీస్ చేస్తుండడం గమనార్హం. జిల్లాలో గత కొన్నేళ్లుగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేసిన దాఖలాలు లేవు. క్రీడాకారుల కోసం కోచ్‌లను సైతం నియమించలేదు. అయినప్పటికీ ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. ఇప్పటి వరకు అందరూ పాత కలెక్టరేట్ మైదానంలోనే ఇబ్బందులు పడుతూ ముందుకెళుతున్నారు. ఈ ఒక్క మైదానంలోనే హకీ, బాక్సింగ్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, ఉషూ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడలకు సీనియర్ క్రీడాకారులు శిక్షణ ఇస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి, పతకాలతో దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన ప్రతిభావంతమైన క్రీడాకారులు ఉన్న జిల్లా నిజామాబాద్. ఇక్కడ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించేందుకు గాను స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణం చేయాలనే డిమాండ్లు ఏళ్లుగా ఉన్నాయి.
● ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి
● ఇండోర్ స్టేడియం విషయంలోనూ ఇదే పరిస్థితి
● సౌకర్యాలు లేకున్నా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు
● పాత కలెక్టరేట్ మైదానంలో ఎల్‌బీ స్టేడియం తరహాలో
నిర్మించాలని ప్రజల డిమాండ్
● మెడికల్ కళాశాల గ్రౌండ్‌గా ఎంసీఐకు చూపిస్తున్నట్లు చర్చ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న పాత కలెక్టరేట్ స్థలంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం తరహాలో నిర్మించాలని ప్రజలు, క్రీడాభిమానులు కోరుతున్నారు. ఇప్పటివరకు ప్ర భుత్వం నుంచి ప్రోత్సాహం అంతంత మాత్రమే ఉన్నప్పటికీ పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరిచారు. కాగా, ప్ర భుత్వం నుంచి తగిన సౌకర్యాలు, సహకారం లభించకపోతుండడంతో ప్రతిభ ఉన్నప్పటికీ అనేకమంది ఔత్సాహిక క్రీడాకారులు వెనుకబడిపోతున్నారు.
సర్వే పూర్తయినా..
స్టేడియం నిర్మాణం కోసం 2024 నవంబర్ 11న సర్వే పూర్తిచేశారు. నిధుల మంజూరే ఆలస్యమని కీలక నాయకులు ప్రకటనలు చేశారు. కానీ, అది మళ్లీ పది అడుగులు వెనక్కి వెళ్లినట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. పాత కలెక్టరేట్ మైదానాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల గ్రౌండ్ కోసం కేటాయించినట్లు ఇప్పటికే ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కు చూపినట్లు, దీంతో ఇందులో స్టేడియం నిర్మాణం సాధ్యం కాదని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో స్టేడియం మంజూరు అనేక అడుగులు వెనక్కి వెళ్లినట్లు సమాచారం.
● సర్వే మేరకు ఈ మైదానంలో 8 లేన్లతో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్, ఉత్తర దక్షిణాలకు 188 మీటర్లు, తూర్పు పడమరకు 125 మీటర్లు ఉండేలా ప్లాన్ చేశారు. లైన్ వెడల్పు 1.22‘‘బ్లేన్స్‘‘2=19.52 మీటర్లు, కర్వ్ డిస్టెన్స్(వంపు దూరం) 36.50‘‘2=73.00 మీటర్లు, లెంగ్త్ ఆఫ్ స్ట్రెయిట్ 84.39‘‘1=84.39 మీటర్లు, ఫ్రీ జోన్ 05మీ‘‘2=10.00 మీటర్లు, మొత్తం 186.91 మీటర్లతో నిర్మించేందుకు అంచనాలు తయారు చేశారు. విడ్త్ విషయానికి వస్తే లైన్ విడ్త్ 1.22‘‘బ్లేన్స్‘‘2=19.52 మీటర్లు, కర్వ్ డిస్టెన్స్ 36.50‘‘2=73.00 మీటర్లు, లాంగ్ జంప్ కోసం 9 మీటర్ల వెడల్పు, ఫ్రీ జోన్ 5 మీటర్లు+10 మీటర్లు = 15 మీటర్లు ఉండేలా మొత్తం 116.52 మీటర్లతో ప్లాన్ తయారు చేశారు.
● పాత కలెక్టరేట్ మైదానంలో స్టేడియం సమీపంలోని స్థలంలో ఇండోర్ స్టేడియం నిర్మించాలనే డిమాండ్లు ఏళ్లుగా ఉన్నాయి. లోపల ఫుట్‌బాల్ మైదానంతోపాటు దాని చుట్టూ 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు, మరోవైపు బాస్కెట్‌బాల్ కోసం, మరో వైపు బాక్సింగ్ ఇండోర్ స్టేడియం, ఉషు, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఇండోర్ స్టేడియాలు నిర్మించాలని డిమాండ్లు ఉన్నాయి. ఇక స్టేడియం చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్ షెట్టర్లు నిర్మించి నిర్వహణ కోసం ఆదాయం రాబట్టుకోవచ్చు.
● తగిన సౌకర్యాలు, ప్రభుత్వ కోచ్‌లు, ప్రోత్సాహం లేకున్నప్పటికీ అంతర్జాతీయ పతకాలు సాధించిన ఆణిముత్యాలైన క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. బాక్సింగ్‌లో హుస్సాముద్దీన్, నిఖత్ జరీన్, హాకీలో యెండల సౌందర్య, ఫుట్‌బాల్ క్రీడలో గుగులోత్ సౌమ్య అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. జిల్లాకు చెందిన ఎతెసామ్ భారత ఆర్మీ బాక్సింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
● నగరం నడిబొడ్డున క్రీడా స్టేడియంతో కూడిన మైదానాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ అథ్లెటిక్స్ జాతీయ మెడలిస్ట్, ఉస్మానియా యూనివర్సిటీ రికార్డ్ హోల్డర్ సయ్యద్ ఖైసర్ 2010లో మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. అదేవిధంగా నగరంలో స్టేడియం కోసం 4 కిలోమీటర్ల మేర రన్నింగ్ చేశాడు.
ఒక్క స్టేడియంతో అనేకమంది క్రీడాకారులు..
నగరంలో స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మిస్తే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే క్రీడాకారులను భారీ సంఖ్యలో తయారు చేయొచ్చు. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లా నుంచి ఎందరో క్రీడాకారులు ఉన్నతంగా ఎదుగుతున్నారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే పతకాలు సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి క్రీడాభివృద్ధికి కృషి చేయాలి. – సయ్యద్ ఖైసర్, జాతీయ అథ్లెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్, శిక్షకుడు
క్రీడాకారులకు, కోచ్‌లకు గుర్తింపు ఇవ్వాలి..
నగరంలో స్టేడియం కోసం వేలాది క్రీడాకారులు ఎదు రుచూస్తున్నారు. తగిన సౌకర్యాలు కల్పించనప్పటి కీ మావంతుగా క్రీడాకారులకు శిక్షణనిస్తున్నాం. నాలాంటి ఎంతో మంది కోచ్‌లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా కోచ్‌లను అభినందించలేదు. ఫుట్‌బాల్ విషయంలో క్రీడామైదానం లేకుంటే ఖాళీ స్థలాలను అద్దెకు తీసుకుని మరీ శిక్షణ ఇస్తున్నాను. పతకాలు సాధించిన తరువాత ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. – నాగరాజు, ఫుట్‌బాల్ కోచ్

స్టేడియం ఊసేదీ..?

స్టేడియం ఊసేదీ..?

స్టేడియం ఊసేదీ..?