
సీఎంసీ మోసంలో.. అసలు సూత్రధారులెవరూ?
షణ్ముకకు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సహకారం?
● ప్రజాప్రతినిధులు అడిగినా లీజుకు ఇవ్వని సీఎస్‌ఐ మెదక్ డయాసిస్ పెద్దలు
● షణ్ముక మహాలింగానికి అనుమతులు
● పెట్టుబడుల రూపంలో వైద్యుల నుంచి రూ. కోట్లు వసూలు చేసిన షణ్ముక
● మోసపోయిన పలువురు జిల్లా డాక్టర్లు
నిజామాబాద్‌నాగారం/ డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండ లం సుద్దపల్లి శివారులో గల సీఎంసీ (క్రిస్టియన్ మెడికల్ కాలేజ్) పున:ప్రారంభం పేరిట వైద్యులను మోసం చేసిన విషయంలో సూత్రధారులెవరనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. మాజీ ఐఏఎస్ పేరిట వై ద్యులను నమ్మించి, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించి మోసం చేసిన షణ్ముక మహాలింగం వెనక ఎవరున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. పక్కా పథకం ప్రకారమే వైద్యుల డబ్బులకు ఎసరు పెట్టారనే చర్చ నడుస్తోంది.
పేరు మార్చి తాత్కాలిక అనుమతులు
సీఎంసీని పున:ప్రారంభిస్తామని, అందులో భాగంగా 50 పడకలతో ఆస్పత్రిని సైతం అందుబాటులోకి తేస్తామని గతేడాది ఏప్రిల్ 27న జిల్లా వైద్యారోగ్యశాఖలో డాక్టర్ ముద్దమాల ఇసాక్ అభిలాష్ పేరిట దరఖాస్తు చేశారు. మూడు నెలల్లో అన్ని వస తులు ఏర్పాటు చేసి, వైద్యులను నియమించుకొని సేవలు అందిస్తామని దరఖాస్తులో పేర్కొన్నా రు. దీంతో నిబంధనల ప్రకారం డీఎంహెచ్‌వో తాత్కాలికంగా మూడు నెలల అనుమతి ఇచ్చారు. కాగా, జూలై 26తో గడువు ముగియడం, ఎంసీఐ అను మతి రాకపోవడంతో మెడికల్ కాలేజీ ప్రారంభం కాలేదు. మళ్లీ ఈ ఏడాది మే 19న మరోసారి సీఎంసీ పున:ప్రారంభం కోసం సీఎస్‌ఐ మెడికల్ ట్రస్ట్ పేరిట డాక్టర్ విమల్‌కుమార్ సుకుమార్, డాక్టర్ ముద్దమాల ఇసాక్ అభిలాష్ దరఖాస్తు చేశారు. గ తంలో మాదిరిగానే మూడు నెలల్లో వసతులు, సౌ కర్యాలు కల్పిస్తామని వైద్యాధికారులతో పేర్కొన్నా రు. అయితే ప్రస్తుత డీఎంహెచ్‌వో అనుమతి ఇవ్వడానికి ససేమేరా అనడంతో పలువురితో ఒత్తిడి తీ సుకువచ్చారు. ఐఎంఏ ప్రతినిధులు వచ్చి విన్నవించడంతోపాటు 26 మంది వైద్యుల పేర్లతో కూడిన జాబితాను అందజేయడంతో తాత్కాలిక అనుమతులు ఇచ్చారు. ఆ గడువుకు కూడా ఈ నెల 18తో ముగియనుండడం గమనార్హం.
తెరమీదకు రిటైర్డు ఐఏఎస్ పేరు..
దేశ, రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్న జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు అడిగినా లీజుకు ఇచ్చేందుకు సీఎస్‌ఐ మెదక్ డయాసిస్ మెడికల్ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఒప్పుకోలేదు. కానీ, కర్ణాటకకు చెందిన షణ్ముక మహాలింగం తాను రిటైర్డ్ ఐఏ ఎస్‌ను అని చెప్పుకోగానే లీజు ఒప్పందం చేసు కోవడం విస్మయం కలిగిస్తోంది. షణ్ముక మహాలింగంను ట్రస్ట్ సభ్యులు ఎలా నమ్మారో అర్థం కావడం లేదని స్థానిక క్రిస్టియన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా రు. షణ్ముక మహాలింగంకు జిల్లాలోని వైద్యులతో నేరుగా సంబంధాలు ఉన్నాయా? లేదంటే ఇక్కడికి ఎలా వచ్చారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది దరఖాస్తు చేసిన ఇసాక్ అభిలాష్ మళ్లీ ఈసారి కూడా దరఖాస్తు చేసుకోవడం చూస్తే పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగిందనే అభిప్రాయా లు వినిపిస్తున్నాయి. డాక్టర్ అజ్జ శ్రీనివాస్‌కు డైరెక్టర్ పదవి ఇస్తామని చెప్పి అతడితో రూ.2.20 కోట్లు పెట్టుబడులు పెట్టించడంతోపాటు మరో 26మంది వైద్యుల నుంచి సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు షణ్ముక మహాలింగం వసూలు చేసినట్లు తెలుస్తోంది. సీఎంసీకి ఎంసీఐ అనుమతి నిరాకరణతోనే ఈ మోసాలన్నీ బయటకు రావడం గమనార్హం.
అసలు షణ్ముకను ఇక్కడికి రప్పించిందెవరు? షణ్ముకకు ఢిల్లీలో మంచి సంబంధాలున్నాయని, ఎంసీఐ నుంచి మెడికల్ కళాశాలకు సులువు గా అనుమతి తీసుకువస్తారని జిల్లాలోని వైద్యులను నమ్మించిందెవరు? అనేది తెలియాల్సి ఉంది.
ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చినా..
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హ యాంలో అప్పటి మంత్రి సుదర్శన్‌రెడ్డి వినతి మేరకు జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మంజూరు చేశారు. అప్పటికే డిచ్‌పల్లిలో ఉన్న సీఎంసీ మూడు సంవత్సరాలు నడిచిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అనుమతి నిరాకరణతో మూతపడింది. అయితే హాస్పిటల్‌తోపాటు మెడికల్ కాలేజీకి అవసరమైన అన్ని వసతి సౌకర్యాలు ఉండటంతో ప్రభుత్వం లీజు ప్రతిపాదన చేసింది. కానీ, లీజు ఇవ్వడానికి మెదక్ డయాసిస్ ప్రతినిధులు నిరాకరించారు. దీంతో ప్రభుత్వ మెడిక ల్ కాలేజీని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. అనంతరం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మరోసారి సీఎంసీ తెరమీదకు వచ్చింది. మాజీ ఎంపీ సీఎంసీ లీజుకు ఎంతగానో ప్రయత్నించినా సీఎస్‌ఐ మెడికల్ ట్రస్టు సభ్యులు నిరాకరించడంతో వీలు కాలేదు.
ఖలీల్‌వాడి: సీఎంసీ పేరిట డాక్టర్ల వద్ద నుంచి రూ.కోట్లు నొక్కేసిన షణ్ముక మహాలింగానికి ఓ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సహకరించినట్లుగా తెలుస్తోంది. కొన్నేళ్ల నుంచి ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు తెలిసిన వారి ద్వారా షణ్ముక మహాలింగం పరిచయమయ్యాడు. దీంతో తన ఇంటి పక్కనే అతనికి ఓ ఇంటిని అద్దెకు ఇప్పించడంతో పాటు షణ్ముకకు కావాల్సిన వాటిని కానిస్టేబుల్ కుటుంబసభ్యులే చూసుకునేవారని తెలిసింది. షణ్ముక నిజామాబాద్ నుంచి సీఎంసీకి వెళ్లేందుకు ఓ కారు డ్రైవర్‌ను సైతం సమకూర్చినట్లు తెలుస్తోంది. కాగా, మూడు నెలలైనా షణ్ముక వేతనం చెల్లించకపోవడంతో సదరు డ్రైవర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సదరు కానిస్టేబుల్ తనకున్న పలుకుబడితో పీఎస్‌లో కేసును సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయినా జీతం డబ్బులు చెల్లించకపోవడంతో షణ్ముక ఇంటికి డ్రైవర్ తాళం వేయడంతో కానిస్టేబుల్ వెళ్లి సమస్యను పరిష్కరించినట్లు తెలిసింది.
మాజీ డీఎస్పీతో పరిచయం
సీఎంసీ పున:ప్రారంభిస్తున్నారని ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ నగరానికి చెందిన ఓ మాజీ డీఎస్పీకి షణ్ముకను పరిచయం చేసినట్లు తెలిసింది. దీంతో సదరు మాజీ డీఎస్పీతో తరుచూ టాచ్‌లో ఉండేవారని తెలుస్తోంది. సీఎంసీకి సంబంధించిన వివరాలను కానిస్టేబుల్ సమక్షంలోనే వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. దీంతో మాజీ డీఎస్పీకి సీఎంసీలో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారనే చర్చ జరుగుతోంది.
నెల క్రితమే పోలీసుల విచారణ!
కర్నాటకకు చెందిన షణ్ముక మహాలింగంను నెల క్రితం పోలీసులు విచారణ చేసినట్లు తెలిసింది. మాజీ ఐఏఎస్ అధికారిని అని చెప్పుకున్నట్లు వ చ్చిన ప్రచారంపై పోలీసులు ఆరా తీయగా, నకిలీ ఐఏఎస్‌గా విచారణలో తేలినట్లు సమాచారం. కా గా, పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ష ణ్ముక మహాలింగం వెంటే ఇంటెలిజెన్స్ కానిస్టేబు ల్ సతీమణి ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమెను పోలీసులు ప్రశ్నించగా, సీఎంసీలో ఉద్యోగిగా పని చేస్తున్నానని, తన భర్త ఇంటెలిజెన్స్‌లో పని చేస్తార ని చెప్పినట్లు తెలుస్తోంది. ఏదైనా తన భర్తే చూసుకుంటారని చెప్పినట్లు పోలీస్‌వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిచ్‌పల్లి పోలీసులు షణ్ముకను తీసుకువెళ్లినప్పుడు సైతం ఆమె వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. విచారణ అనంతరం డిచ్‌పల్లి పీఎస్‌లో షణ్ముకపె చీటింగ్ కేసు నమోదైంది. ఏదేమైనా ఈ కేసులో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
తాత్కాలిక అనుమతి ఇచ్చాం
జిల్లాలో ఏ ఆస్పత్రి ఏర్పాటు చేసినా తాత్కాలికంగా మూడు నెలల అనుమతి ఇవ్వడానికి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మూడు నెలల్లో పూర్తిస్థాయిలో వైద్యులు, వసతులు ఏర్పాటు చేయించాలని తాత్కాలిక అనుమతులు ఇచ్చాం. మూడు నెలల్లో నిబంధనల ప్రకారం ఫీజును డీడీ రూపంలో చెల్లించి, అన్నీ పక్కాగా ఉంటే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే రద్దు చేస్తాం. మరో 10 రోజులు తాత్కాలిక అనుమతుల గడువు ఉంది. దీనిపై పోలీసు అధికారులు అడిగితే సమాచారం కూడా పంపించాం. – రాజశ్రీ, జిల్లా వైద్యాఽధికారి