
విద్యార్థులకు ప్ర‘యోగం’ ఎప్పుడో?
నందిపేట్(ఆర్మూర్): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రయోగాలు చేసే యోగం ఎప్పుడొస్తుందోనని ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సర్కార్ బడులకు ఆరేళ్లుగా నిధులు విడుదల కాకపోవడం, సరిపడా సైన్స్ పరికరాలు లేకపోవడంతో విద్యార్థులు ప్రయోగ విద్యకు దూరమవుతున్నారు. అయినా సంబంధిత అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
‘ఉన్నత’ విద్యార్థుల కోసం..
జిల్లాలో 1042 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 77,224 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైన్స్ విద్యను అందిచాలనే లక్ష్యంతో ప్రయోగశాలలు ఏర్పాటు చేసినా కొన్నేళ్లుగా నిధుల లేమితో లక్ష్యం నీరుగారుతోంది. విధిలేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఉన్న పరికరాలతోనే పాఠాలు బోధించి మమ అనిపిసున్నారు. 6వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టులలో ఎక్కువ భాగం ప్రయోగాలతో కూడిన పాఠ్యాంశాలు ఉంటాయి. వాటిని ప్రయోగం చేసి చూపితే గాని అర్థం కాని పరిస్థితి. దీంతో ప్రయోగాత్మక బోధనపై సంబందిత సబ్జెక్టుకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రయోగ పరికరాలు, రసాయనాల కొనుగోలుకు గతంలో విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అప్పట్లో అరకొర నిధులు మంజూరు చేయగా కొద్దిపాటి పరికరాలు కొనుగోలు చేశారు. కొద్దిపాటి పరికరాలతో ప్రయోగాలు సంపూర్ణంగా చేసే అవకాశం లేకపోవడంతో పలు పాఠశాలల్లో అవిసైతం మూలన పడ్డాయి.
2019 నుంచి..
రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా ప్రతి ఉన్నత పాఠశాలకు 2019లో రూ. 50వేలు, ప్రాథమిక పాఠశాలలకు రూ. 22వేలు విడుదల చేశారు. వీటి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఆరేళ్ల క్రితం కొన్ని పరికరాలు కొనుగోలు చేశారు. ఫలితంగా పాఠశాలల్లో ప్రయోగాత్మక బోధన నిర్వహణ కష్టతరంగా మారింది. అందులో ఉన్న పరికరాలతో పాటు కాలం చెల్లిన రసాయనాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తూ మమ అనిపిస్తున్నారు. ప్రయోగాలపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో సైన్స్ పోటీలకు విద్యార్థులు దూరంగా ఉంటున్నారు. ఏటా ప్రభుత్వం నిర్వహించే సైన్స్‌ఫేర్, ఇన్స్‌స్పైర్ అవార్డుల్లో వెనుకబడుతున్నారు. ప్రతిభ ఉన్నా సరిపడా శిక్షణ, అవగాహన లేక విద్యార్థులు సత్తా చాటలేకపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రయోగాత్మక బోధనకు అవసరమైన పరికరాలు సమకూర్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో
కానరాని సైన్స్ పరికరాలు
కొన్నేళ్లుగా విడుదల కాని నిధులు
నిధులు మంజూరు కాలేదు..
సైన్స్ పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు కాగానే పరికరాలు కొనుగోలు చేస్తాం. విద్యార్థులకు కావాల్సిన కొన్ని సైన్స్ పరికరాలను ఉపాధ్యాయులు తయారు చేసి అవగాహన కల్పిస్తున్నారు.
– అవదూత గంగాధర్, ఎంఈవో, నందిపేట

విద్యార్థులకు ప్ర‘యోగం’ ఎప్పుడో?