
ఇలా వచ్చి.. అలా వెళుతున్నారు
● ఆర్‌అండ్‌బీలో
ఉన్నతాధికారుల పరిస్థితి
● బాధ్యతలు స్వీకరించిన
కొన్ని నెలలకే పదవీవిరమణ
● ఇన్‌చార్జి అధికారులతో
నెట్టుకొస్తున్న వైనం
నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ శాఖలో కీలక అధికారులు వచ్చిన కొన్నినెలలకే పదవీ విరమణ చేస్తుండటంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో ఇన్‌చార్జి అధికారులతో పాలనను నెట్టుకొస్తున్నారు. ఈక్రమంలో ఎప్పడు అధికారులతో నిండుగా ఉండే జిల్లాకేంద్రంలోని కార్యాలయం ఖాళీల కారణంగా బోసి పోతుంది.
ముఖ్యమైన పోస్టులు ఖాళీ..
ఆర్‌అండ్‌బీలో ప్రధానంగా ఎస్‌ఈ, ఈఈ, డిప్యూటీ ఎస్‌ఈ మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటీతో పాటు ఎస్‌ఈ కార్యాలయంలో సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉంది. శాఖలో బాల్కొండ, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ ఐదు సబ్ డివిజన్‌లున్నాయి. బాల్కొండ సబ్ డివిజన్‌కు డిప్యూటీ ఈఈ లేకపోవడంతో ఆర్మూర్ సబ్ డివిజన్ డిప్యూటీ ఈఈకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో సబ్ డివిజన్‌కు ఒక్కో ఏఈ మాత్రమే ఉండడంతో తమపై పనిభారం పెరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆర్‌అండ్‌బీలో పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
నిజామాబాద్ జిల్లా ఆర్‌అండ్‌బీ శాఖలో ఎస్‌ఈగా విధులు నిర్వహించిన సత్యనారాయణరెడ్డి ఇటీవల పదవీ విరమణ చేశారు. గత నెలలో డిప్యూటి ఎస్‌ఈ సైతం కొన్ని రోజులు ఈఈగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఈఈగా సురేష్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. అనంతరం డిప్యూటీ ఈఈ శ్రీమాన్ ఇన్‌చార్జి ఈఈగా వ్యవహారించి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాతా డిప్యూటీ ఎస్‌ఈ కూడా ఇన్‌చార్జిగా వ్యవహరించి వీడ్కోలు పలికారు. సత్యనారాయణరెడ్డి కంటే ముందు ఎస్‌ఈగా విధులు నిర్వహించిన హన్మంత్‌రావు 6 నెలలు గడవకముందే సీఈగా పదోన్నతి పొంది, పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే.