
ప్రోత్సహించే వారుంటే కాదేది అసాధ్యం
● రన్నింగ్ పోటీల్లో రాణిస్తున్న
ఖానాపూర్ వాసి అజయ్‌కుమార్
నిజామాబాద్ రూరల్: ‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది’ అన్న స్వామి వివేకానంద మాటలు గుర్తుంచుకున్న ఖానాపూర్ వాసి గరిపల్లి అజయ్‌కుమార్ నేషనల్ అథ్లెటిక్ పరుగు పందెంలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన అజయ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయా డు. తాత–నానమ్మ వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. తాత అనారోగ్యానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. అయినా కుంగిపోకుండా తనకంటు జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. పరుగు పందెంలో చిన్ననాటి నుంచే ఆసక్తి ఉన్న అతనికి కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. అంతేకాకుండా గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు ఇచ్చిన ప్రోత్సాహంతో పోటీల్లో రాణిస్తున్నాడు. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన నేషనల్ అథ్లెటిక్ పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచి మెడల్ సాధించాడు. అదేవిధంగా గత నెల 19న పంజాబ్, బిహార్ లో నిర్వహించిన నేషనల్ అథ్లెటిక్ కాంపిటేషన్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో రాణించాడు. అంతకుముందు చైన్నెలో జరిగిన నేషనల్ కాంపిటీషన్‌లో సైతం ప్రతిభ కనబర్చాడు. తనకు ఆర్థికంగా, ఆత్మస్థైర్యాన్ని నింపిన వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తానని అజయ్ కుమార్ అంటున్నాడు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓడిపోయిన వారు మళ్లీ ఆత్మస్థైర్యంతో గెలవడానికి ప్రయత్నించాలని విద్యార్థులకు, తోటి యువకులకు అతడు తెలుపుతున్నాడు.