
విద్యార్థుల అభ్యున్నతికి సమన్వయంతో పనిచేయాలి
నిజామాబాద్‌అర్బన్: విద్యార్థుల అభ్యున్నతి కోసం అధ్యాపకులు సమన్వయంతో పనిచేసి, మంచి ఫలి తాలను సాధించాలని ఇంటర్ విద్యా జిల్లా ప్రత్యేక అధికారి ఒడ్డెన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ బాలికల జూనియర్ కళాశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఒడ్డెన్న మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాల్సిందేనని అన్నారు. కళాశాల ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నందున యూనిట్ టెస్టులు నిర్వహించి మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను గుర్తించాలని అన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, వారు చదువుకునేవిధంగా ఆసక్తి కలిగించాలని సూచించారు. విద్యార్థులు కళాశాలకు హాజరుకాకుంటే వారి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందజేసే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిజామాబాద్ నుంచి ప్రారంభించాలన్నారు. నిజామాబాద్ బాలికల జూనియర్ కళాశాల రాష్ట్రంలోనే మోడల్ జూనియర్ కళాశాలగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కళాశాల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని అన్నారు. జిల్లా ఇంటర్ అధికారి రవికుమార్ తదితరులు ఉన్నారు.