
ఉద్యోగులు అటెన్షన్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘కలెక్టర్ సార్ ఈ రోజు ఏ మండలానికి వస్తున్నారు? మా కార్యాలయానికి వస్తున్నారా?’ అంటూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజూ ఆరా తీస్తున్నారు. కలెక్టర్ పర్యటన, ఆకస్మిక తనిఖీల విషయమై ప్రతి అంశాన్ని ఉద్యోగులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఒక్కరోజు కూడా విరామం ఇవ్వకుండా ప్రతిరోజు వివిధ మండలాల్లో పర్యటిస్తూ ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఉద్యోగులందరూ పూర్తిగా అటెన్షన్‌తో వ్యవహరిస్తున్నారు.
సమయపాలన పాటిస్తున్న ఉద్యోగులు
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి క్షేత్ర పర్యటన వివరాలు ఆయన డ్రైవర్ సహా ఎవరికీ తెలియకపోవడంతో మండల స్థాయి అధికారులు, ఉద్యోగుల్లో భయం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి కచ్చితంగా సమయపాలన పాటిస్తుండడం గమనార్హం. జూన్ 13న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డి మరుసటి రోజు 14వ తేదీ నుంచే మోపాల్ మండల పర్యటనతో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. పోస్టాఫీసులను సైతం సందర్శించి తనిఖీలు చేస్తుండడం గమనార్హం. తాను పర్యటించిన మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎరువుల గోదాములు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాలను తనిఖీ చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో వైద్య సేవలు, పాఠశాలలు, అంగన్‌వాడీల్లో పిల్లల హాజరు, మధ్యాహ్న భోజనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఎరువుల నిల్వలపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ విషయమై ప్రతి అంశాన్ని గురించి క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుంటున్నారు.
ఉరుకులు.. పరుగులు
విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించేది లేదని కలెక్టర్ చెప్పడంతో పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, వ్యవసాయ శాఖ, రెవెన్యూ ఉద్యోగులు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఎక్కడైనా లోటుపాట్లు, సమస్యలు కనిపి స్తే సరిచేసుకోవాలని కలెక్టర్ సూచనలు చేస్తున్నా రు. మళ్లీ 15 రోజుల్లో వస్తానని, ఆ సమయంలో స దరు సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశా లు ఇస్తున్నారు. దీంతో అధికారులు ఉరుకులు, ప రుగులు పెడుతున్నారు. మరోవైపు జిల్లా అధికా రుల సమీక్ష సమావేశంలోనూ కలెక్టర్ ప్రతి విషయాన్ని పిన్‌పాయింటెడ్‌గా అడుగుతున్నారు. దీంతో అధికారులు సైతం అలర్ట్‌గా ఉంటున్నారు.
అన్ని మండలాల్లో అప్రమత్తం
పెద్దసారు ఎటువైపు వెళ్తున్నారో.. ప్రతిరోజూ ఆరా తీస్తున్న ఉద్యోగులు
కారెక్కిన తర్వాతే ఏ మండలానికి వెళ్లేది నిర్ణయిస్తున్న ఉన్నతాధికారి
సిబ్బందితో కళకళలాడుతున్న
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు
సాయంత్రం వరకు తప్పనిసరి
విధుల నిర్వహణ
అన్ని విభాగాలను చుట్టేస్తూ..
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బయల్దేరిన సమయంలో ఏ మండలం వైపు వెళ్లే విషయాన్ని ఎవరికీ చెప్పడం లేదు. కారులో కూర్చున్న తర్వాత డ్రైవర్‌కు డైరెక్షన్ ఇస్తూ తాను ఎంపిక చేసుకున్న మండలానికి వెళ్తున్నారు. ఆయా మండలాలకు వెళ్లిన తర్వాత సైతం ఎప్పుడు ఏ కార్యాలయానికి వెళతారో, పాఠశాల, ఆస్పత్రులకు వెళతారో అనే విషయమై ఎవరికీ చెప్పకుండా ఆకస్మికంగా సందర్శిస్తున్నారు. అయితే తన పర్యటనలో మాత్రం మండలంలోని అన్ని ప్రభుత్వ విభాగాలను తనిఖీ చేస్తున్నారు. పైగా వెళ్లే దారిలోని గ్రామాల్లోనూ ఆగుతూ వివరాలు తెలుసుకుంటున్నారు. దీంతో ఉద్యోగులు కచ్చితంగా తాము విధులు నిర్వర్తించే ప్రాంతాల్లోనే ఉంటున్నారు. కలెక్టర్ ఎప్పుడు వస్తారో అనే విషయమై తెలియకపోవడంతో సాయంత్రం వరకు ఉద్యోగులు విధుల్లో ఉంటున్నారు. దీంతో అన్ని కార్యాలయాలు కళకళలాడుతున్నాయి.