
ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రారంభం
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయం నుంచి ప్రాజెక్ట్ అధికారులు, ప్రజాప్రతినిధులు నీటి విడుదలను గురువారం ప్రారంభించారు. కాకతీయ కాలువ ద్వారా జోన్–1 కోసం (డీ–53 వరకు) 3,500 క్యూసెక్కులు, మిడ్‌మానేరు కోసం వరద కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, లక్ష్మికాలువ ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటి విడుదల చేపట్టారు. కాకతీయ కాలువ ద్వారా జోన్–1 వరకు మాత్రమే ప్రస్తుతం నీటి విడుదల కొనసాగుతుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఎస్‌ఈ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 40.5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందన్నారు. అందులో 5 టీఎంసీలు డెడ్‌స్టోరేజీ, 5 టీఎంసీలు తాగునీటి అవసరాలకు కేటాయించగా 30 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. నాలుగు తడులుగా విభజించి నీటి విడుదల చేపడుతామన్నారు. జోన్–1, 2ల కోసం వారబందీ అమలు చేస్తూ నీటి విడుదల చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఆధారంగా నీటి విడుదల జరుగుతుందని వివరించారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేష్‌రెడ్డి అన్నారు. నీటి విడుదల అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుత సంవత్సరం వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, దీంతో ప్రాజెక్ట్‌లోకి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నీరు రాలేదన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నీటి విడుదలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఎస్‌ఈ శ్రీనివాస్ గుప్తా, ఈఈ చక్రపాణి, పీఏసీఎస్ చైర్మన్‌జక్క రవి, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి రవి, డీసీసీ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు సంతోష్, మాజీ సర్పంచ్ కట్కం రమేశ్, సుమో రాజేశ్వర్, ఆకుల పెద్ద రాజన్న, నాగంపేట్ గంగాధర్, రైతులు పాల్గొన్నారు.
సరస్వతి కాలువకు నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే
ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నీటి విడుదల చేపట్టారు. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ఉన్నారు.
విద్యుదుత్పత్తి ప్రారంభం
ఎస్సారెస్పీ వద్ద ఉన్న జల విద్యుదుత్పత్తి కేంద్రంలో జెన్‌కో ఎస్‌ఈ రమేశ్ విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. కాకతీయ కాలువ ద్వారా 3500 క్యూసెక్కుల నీటిని వదలడంతో ఒక్క టర్బాయిన్ ద్వారా 7 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని జెన్‌కో డీఈఈ శ్రీనివాస్ తెలిపారు.
నాలుగు తడులకు నీటి సరఫరా
30 టీఎంసీలు కేటాయింపు
స్విచ్ ఆన్ చేసిన అన్వేష్ రెడ్డి,
ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి
గతేడాదీ ఆగస్టు 7నే..
గతేడాది ఖరీఫ్ పంటల కోసం కాలువల ద్వారా ఆగస్టు 7నే ప్రాజెక్ట్ అధికారులు, ప్రజా ప్రతినిధులు నీటి విడుదలను చేపట్టారు. ప్రస్తుత సంవత్సరం కూడా అదే తేదీన నీటి విడుదల ప్రారంభించడం యాదృచ్ఛికంగా జరిగింది. కాగా, గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్‌లో 47 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం 40.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రారంభం