
పంటను ధ్వంసం చేయడమెందుకు?
● ఫారెస్టు అధికారులను ప్రశ్నించిన సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్‌రావు
● గిరిజనులతో కలిసి భూమి పరిశీలన
మోపాల్(నిజామాబాద్‌రూరల్): చేతికొచ్చిన మొక్కజొన్న పంటకు గడ్డి మందు కొట్టి ధ్వంసం చే యాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఫారెస్ట్ అధి కారులను జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్‌రావు ప్రశ్నించారు. మోపాల్ మండలం భైరాపూర్ మోతీరామ్‌నాయక్ తండాలో గురువారం సాయంత్రం అ టవీ అధికారులు గడ్డి మందు కొట్టిన మొక్కజొన్న పంటను ఆయన పరిశీలించారు. మొక్కజొన్నకు గడ్డిమందు కొట్టడంతో మనస్తాపానికి గురైన రైతు ప్రకాశ్ నాయక్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు, వాస్తవ పరిస్థితులు, భూముల వివరాలను గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ భూముల వివరాలను సంబంధిత అధికారుల వద్ద వాకబు చేశారు. మొక్కజొన్న పంట సాగు చేసి రెండున్నర నెలలు గడిచిపోయిందని, చేతికొచ్చే పంటకు గడ్డి మందు కొట్టి ధ్వంసం చేశారని, దీంతో రూ.లక్షకుపైన నష్టం వాటిల్లిందని గిరిజనులు వివరించారు. కాగా, ఆత్మహత్యాయత్నంతో అధికారులను బె దిరించే ప్రయత్నం చేసిన రైతుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. అటవీ భూమిలో ప్ర కాశ్ అక్రమంగా సాగు చేయడంతోనే తాము అడ్డు కున్నట్లు ఫారెస్ట్ అధికారులు వివరించారు. అన్నివర్గాల నుంచి విషయ సేకరణ చేసిన జడ్జి ఉదయ్ భాస్కర్‌రావు పలు విలువైన సూచనలు చేశారు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని, చట్టానికి బాధ్యులుగా ఉండాలన్నారు. రైతు ప్రకాశ్‌పై నమోదైన కేసును సామరస్యంగా పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. జడ్జి వెంట న్యాయవాదులు ఆశ నారాయణ, బాల్‌రాజ్ నాయక్, రవిప్రసాద్, న్యాయసేవా సంస్థ సూపరింటెండెంట్ శైలజ, సెక్షన్ ఆఫీసర్ బాసిత్, ఎల్‌హెచ్‌పీఎస్ అధ్యక్షుడు చవాన్ మోహన్ నాయక్, సేవాలాల్ సేన ప్రధాన కార్యదర్శి నరేశ్ నాయక్, ఇందల్ నాయక్, జలందర్, గౌతమ్, జవహర్‌లాల్ తదితరులు ఉన్నారు.