
ఉత్తమ ఫలితాల కోసం దీర్ఘకాలిక ప్రణాళిక
నిజామాబాద్‌అర్బన్: విద్యా బోధనలో ఉత్తమ ఫలితాల కోసం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర ఇంటర్ విద్య బోర్డు జిల్లా ప్రత్యేకాధికారి ఒడ్డెన్న అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్యా కార్యాలయంలో డీఐఈవో రవికుమార్ అధ్యక్షతన ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా బోధనపై ప్రిన్సిపాళ్లు ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ వహించి దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించి అధ్యాపకులతో అమలు చేయించాలన్నారు. అపార్ గుర్తింపు లేని విద్యార్థులను గుర్తించి వెంటనే అపార్ నంబర్ గుర్తింపుతో పాటు యుడైస్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకులు సమయపాలన పాటించడంలో ప్రిన్సిపాళ్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై అధ్యాపకులు శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.