
బీకేఎస్ కృషితో రైతుకు న్యాయం
మోపాల్: భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో చేసిన పోరాటం, వినతులకు కలెక్టర్, పౌరసరఫరాలశాఖ అధికారులు స్పందించి రైతుకు న్యాయం చేశారు. లారీ కాంట్రాక్టర్ ద్వారా ఇప్పించిన రూ.60వేల చెక్కును బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు దేవుడిగారి సాయిరెడ్డి రైతు బక్క పోతన్నకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని సిర్‌పూర్ గ్రామానికి చెందిన రైతు బక్క పోతన్న వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని తెలిపారు. మే 18న 400 బస్తాల ధాన్యాన్ని మోపాల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించారన్నారు. కానీ ట్రక్ షీట్‌లో కేవలం 310 బస్తాలు మాత్రమే అందినట్లు రైస్‌మిల్లు ద్వారా చూయించి ఈ బస్తాలకు మాత్రమే రూ.2,27,680 నగదు బ్యాంకు అకౌంట్‌లో జమచేశారని పేర్కొన్నారు. ఇదే విషయమై సొసైటీ సిబ్బందిని ప్రశ్నించినా.. నిలదీసినా.. స్పందించలేదని రైతు కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బీకేఎస్ కార్యకర్త గంగారెడ్డి రైతు బాధను విని, భారతీయ కిసాన్ సంఘ్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారన్నారు. అన్ని రుజువులతో రైతు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి విన్నవించగా, ఆయన వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి రైతుకు న్యాయం చేయాలని ఆదేశించారని తెలిపారు. ఆ తర్వాత పోతన్న బీకేఎస్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్, పౌరసరఫరాలశాఖ అధికారులను కలువగా, తప్పిదానికి కారణమైన ట్రాన్స్‌ఫోర్ట్ కాంట్రాక్టర్ నుంచి రూ.60వేలను రైతుకు ఇప్పించామని పేర్కొన్నారు. రెండు నెలలపాటు భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు దేవుడిగారి సాయిరెడ్డి, గంగారెడ్డి, జనగాం భూమయ్య, ధశరథ్‌రెడ్డి తదితరులు కృషికిగాను రైతుకు న్యాయం జరిగిందని తెలిపారు. బీకేఎస్ పోరాటానికి రైతు బక్క పోతన్న ధన్యవాదాలు తెలిపారు.
లారీ కాంట్రాక్టర్‌తో రూ.60వేలు ఇప్పించిన నాయకులు