
క్రైం కార్నర్
పాముకాటుతో యువకుడి మృతి
బాన్సువాడ రూరల్: మండలంలోని తిర్మలాపూర్‌కు చెందిన వరగంతం రాజు (25) అనే యువకుడు పాముకాటుతో మృతి చెందినట్లు బాన్సువాడ సీఐ మండల అశోక్ తెలిపారు. దినసరి కూలి అయిన రాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటివద్దే ఉంటున్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాముకాటు వేయడంతో గమనించిన కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి తల్లి భూమవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ తెలిపారు.
అనారోగ్యంతో వృద్ధురాలి ఆత్మహత్య
రెంజల్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెంజల్ మండలం దూపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పొతరాజు చిన్న గంగామణి(57) అనే వృద్ధురాలు ఇంట్లో ఒక్కరే ఉంటున్నారు. ఆమె ఐదేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చూయించినా నయం కావడం లేదు. దీంతో జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె దేవ గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని షేక్ చాంద్ హోటల్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న రాజారాందుబ్బాకు చెందిన దాసరి పోశెట్టిని అరెస్ట్ చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు నిజామాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ బాబాఖాన్ వద్ద కొనుగోలు చేసి బాన్సువాడలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. పోశెట్టి నుంచి 275 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పోశెట్టిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

క్రైం కార్నర్