
డీ–వార్మింగ్ డేపై ప్రచారం చేయాలి
నిజామాబాద్ అర్బన్: నులిపురుగుల నివారణ మాత్రను 0–19 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరికీ అందించాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. డీ–వార్మింగ్ డేపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో డీ–వార్మింగ్ డే కార్యక్రమంపై టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులకు, మదర్సాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలందరికీ నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రను అందించాలని తెలిపారు. ప్రతి పాఠశాల, కళాశాలల్లో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. భోజనం తిన్న తర్వాత ఈ మాత్రను పిల్లలకు వేయాలని తెలిపారు. పిల్లలలో రక్తహీనత, బరువు తగ్గుదల తదితర వ్యాధుల నుంచి కాపాడేందుకు అల్బెండజోల్ మాత్ర దోహదపడుతుందని అన్నారు. ఈ మాత్ర వేసుకోవడం ద్వారా ఎనీమియా, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. ఆహార పదార్థాలు తినే ముందు పిల్లలు చక్కగా చేతులు శుభ్రం చేసుకునేలా పాఠశాలల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. విద్యా, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమశాఖలతోపాటు మెప్మా, ఐకేపీ, మున్సిపల్ సిబ్బంది, ఐఎంఏ ప్రతినిధులు, ఇతర శాఖల అధికారులు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ నెల 11న అన్ని చోట్ల అల్బెండజోల్ మాత్రలు ప్రతి విద్యార్థికి వేశారా లేదా అన్నది పక్కాగా నిర్ధారిస్తూ, ఒకవేళ ఎవరైనా తప్పిపోతే అలాంటి వారిని సైతం గుర్తించి మలివిడతగా ఈ నెల 18న నులి పురుగు నివారణ మాత్ర వేయించాలని అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.
11న నులి పురుగుల నివారణ దినోత్సవం
ఈ నెల 11న నులిపురుగుల నివారణ దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామని డీఎంహెచ్‌వో రాజశ్రీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 19ఏళ్ల లోపు వయసు కలిగిన 4,05,443 మందికి మాత్రలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. మాత్ర వేసుకున్న తర్వాత ఎవరికై నా వాంతులు అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అత్యవసరమైతే సమీప ఆస్పత్రి, పీహెచ్‌సీకి తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, నోడల్ అధికారులను గుర్తించామని అన్నారు. అనంతరం డీ–వార్మింగ్ డేపై అవగాహన కల్పించే గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీపీవో శ్రీనివాస్ రావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అశోక్, డీడబ్ల్యూవో రసూల్ బీ పాల్గొన్నారు.
19 ఏళ్లలోపు పిల్లలకు
అల్బెండజోల్ మాత్ర అందించాలి
కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి