
రంగుమారుతున్న ఎస్సారెస్పీ నీరు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నిల్వ ఉన్న నీరు ఒక్కసారిగా రంగు మారింది. గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్ట్ నీరు ఆకుపచ్చ రంగులా మారింది. కాలువల ద్వారా నీటి విడుదల చేపడితే పంటలకు తెగుళ్లు వ్యాపించాయని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆ నీటిని ప్రస్తుతం ఆయకట్టుకు సరఫరా చేస్తే పంటల పరిస్థితి ఏంటని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు సైతం చేపలు మృత్యువాత పడే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు. నీరు సైతం దుర్వాసన రావడంతో పర్యాటకులు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎందుకు రంగు మారుతుంది?
ప్రతి సంవత్సరం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదలు వచ్చిన వారం రోజుల తరువాత నీటి రంగు మారుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వరదలు వచ్చినప్పుడే ప్రాజెక్ట్‌నీరు రంగు మారుతుంది. ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్రలోని ధర్మాబాద్ వద్ద పలు ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను గోదావరిలోకి అధికంగా వదలడంతో ప్రాజెక్ట్‌లోకి కొట్టుకు వచ్చి రంగు మారుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. కానీ అధికారులు, పాలకులు మాత్రం ఈ సమస్యపై దృష్టి సారించడం లేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు 231 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. గత రెండేళ్ల క్రితం పరీక్ష కోసం నీటి నమూనాలను సేకరించారు. కానీ, నీరు కలుషితం కావడం లేదని నివేదిక ఇచ్చారు. నీరు కలుషితం కానప్పుడు వ్యర్థంతో నీరు రంగు ఎందుకు మారుతుందనే ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం ఉండదు. ప్రాజెక్ట్ నీరు రంగు మారడంపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే తప్ప నిజాలు బయటకు వచ్చేలా లేవని ఆయకట్టు రైతులు అంటున్నారు.
ప్రతియేటా ఇదే పరిస్థితి
పరీక్షలు జరిపి, కలుషితం
కాలేదంటున్న అధికారులు
ఫిర్యాదు రాలేదు..
మిషన్ భగీరథ వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. నీరు మాత్రం రంగు మారింది. మిషన్ భగీరథ అధికారులు నిత్యం నీటిని పరీక్షలకు పంపుతున్నారు. అవసరమైతే మళ్లీ శాంపిళ్లను పరీక్షల కోసం పంపుతాం. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ