
కాంగ్రెస్ పాదయాత్రలో బందోబస్తు ఎందుకు?
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనహిత పాదయాత్రకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా ప్రజలు ఎక్కడ తమపైకి తిరగబడతారోననే భయంతో వందలాది మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకోవడం సిగ్గు చేటన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ జిల్లాలో రెండు రోజుల కార్యక్రమంలో ప్రజలతో మమేకం అయ్యిందేమీ లేదని కేవలం జనాల్లో హడావుడి సృష్టించేందుకు చేసిన డ్రామా అని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్‌పై పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటలను విని జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదని జోస్యం చెప్పారు. ప్రజలంతా డిసైడ్ అయ్యారని, బీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నదని బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలతో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన మొత్తం 420 హామీలలో ఎన్ని అమలు చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. జిల్లాలో 2లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్న విషయం పాదయాత్ర సందర్భంగా మీ దృష్టికి రాలేదా? అని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇస్తామని ముఖం చాటేయలేదా అని విమర్శించారు. కేసీఆర్ రైతుబంధు ఇచ్చి అన్నదాతలకు అండగా నిలిస్తే, సీఎం రేవంత్ రెడ్డి రైతులకు భరోసా లేకుండా చేసి వారికి వెన్నుపోటు పొడవలేదా? అని బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. ఆసరా పెన్షన్లు పెంచి రూ.4వేల చొప్పున ఇస్తామన్న హామీ ఏమైందని, ఒక్కరికై నా నిరుద్యోగ భృతి ఇచ్చారా అని పేర్కొన్నారు. మహిళలకు రూ.2,500, విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తారని నిలదీశారు. ఇచ్చిన హామీలపై మీనాక్షి నటరాజన్‌తో సహా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నోరు విప్పకపోవడం శోచనీయమన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ భేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు.
జనాలు తిరగబడతారనే భారీ భద్రత
నిజామాబాద్ రూరల్
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శ