
విద్యుత్ సమస్య లేకుండా చూడండి
వేల్పూర్: మండలంలోని పడగల్ గ్రామంలో సాగు కు నెలకొన్న విద్యుత్ సమస్య తీర్చాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈ రవీందర్‌ను సోమవారం ఫోన్‌లో కోరారు. పడగల్‌లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని, దాంతో మొక్కజొన్న పంట ఎండిపోయే పరిస్థితి నెలకొందని స్థానిక రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గత కొద్ది రోజులుగా ఒకవైపు ఆరుగంటలు, మరోవైపు ఆరుగంటలు కరెంటు సరఫరా ఇస్తున్నారని దీంతో పంటలకు నీరు సరిగ్గా అందక ఎండిపోయే ప్రమాదముందని ఎమ్మెల్యే వేముల ఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు సబ్‌స్టేషన్‌కు వెళ్లి అడిగితే లో వోల్టేజి సమస్య ఉందని, 3 కెపాసిటర్ సెల్స్, 4 బ్యాటరీలు ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారన్నారు. మెటీరియల్ అందజేసి రైతులకు విద్యుత్ సమస్య లేకుండా చూడాలని ఎస్.ఈ.కి ఎమ్మెల్యే సూచించారు.