
పోలీస్‌శాఖ సేవలపై అవగాహన
ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి గ్రామంలో పోలీస్‌శాఖ సేవలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు కళా బృందం సభ్యులు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాటలు, నాటికల రూపంలో కల్తీ కల్లు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ మోసాలకు గురికాకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళల రక్షణ, సమాజ సేవ, చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై సందీప్, వీడీసీ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్‌రెడ్డి, కళాబృందం సభ్యులు పాల్గొన్నారు.
సదస్సును
విజయవంతం చేయాలి
నిజామాబాద్ అర్బన్: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్‌లో నిర్వహించే సన్నాహక సదస్సును పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు పోశెట్టి సోమవారం కోరారు. వికలాంగుల పింఛన్ పెంపు, పార్టీ సన్నాహక సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ రానున్నట్లు తెలిపారు. వికలాంగులు, బహుజనులు సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు.
బీఆర్‌ఎస్ పార్టీపై
విమర్శలు తగవు
నిజామాబాద్ రూరల్: బీఆర్‌ఎస్ పార్టీ, మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలు తగవని జెడ్పీ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్ రావు సోమవారం అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి 40 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించిందన్నారు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజానిజాలు తెలియకుండా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అనవసంగా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరైనా బీఆర్‌ఎస్ పార్టీ పై అనుచిత వాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
గస్తీ దళాల ఏర్పాటు
మోపాల్: మండలంలోని కులాస్‌పూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దొంగతనాల నివారణకు గస్తీ దళాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల గ్రామంలో ఒకేరోజు 11 తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అన్ని కుల సంఘాల నుంచి ఇద్దరు చొప్పున రాత్రి 10 నుంచి ఉదయం 4 గంటల వరకు గస్తీ కాస్తున్నారు. అంతేగాకుండా అనుమానాస్పద వ్యక్తులు గ్రామంలో సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారమిచ్చేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
డాక్టరేట్ గ్రహీతకు సన్మానం
సిరికొండ: తెలంగాణ విశ్వవిద్యాలయంలో చదివి డాక్టరేట్ సాధించిన తోటి మిత్రుడిని క్లాస్‌మేట్స్ ఘనంగా సన్మానించారు. మండలంలోని గడ్కోల్ గ్రామానికి చెందిన కర్క గణేశ్ ‘ఎఫెక్ట్ ఆఫ్ సింటరింగ్ మెథడాలజీ ఆన్ స్ట్రక్చరల్, మాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంపోసిట్ ఫెర్రైట్స్’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు. గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 2007–08లో పదో తరగతి పూర్తి చేసిన అతడిని బ్యాచ్ మిత్రులు సన్మానించారు. డాక్టరేట్ సాధించినందుకు అభినందించారు.