కానిస్టేబుల్‌ కుమారుడిపై మైనర్‌ డ్రైవింగ్‌ కేసు | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ కుమారుడిపై మైనర్‌ డ్రైవింగ్‌ కేసు

Jun 7 2025 1:08 AM | Updated on Jun 7 2025 1:08 AM

కానిస్టేబుల్‌ కుమారుడిపై  మైనర్‌ డ్రైవింగ్‌ కేసు

కానిస్టేబుల్‌ కుమారుడిపై మైనర్‌ డ్రైవింగ్‌ కేసు

ఖలీల్‌వాడి: నగరంలో ఓ కానిస్టేబుల్‌ కుమారుడు మైనర్‌ డ్రైవింగ్‌ చేయడంతో ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని రైల్వేస్టేషన్‌ వద్ద శుక్రవారం ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ కానిస్టేబుల్‌కు ప్రభుత్వం కేటాయించిన బైక్‌ను అతడి కొడుకు (మైనర్‌) నడిపించడంతో ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, బైకును సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

ఇసుక వాహనం పట్టివేత

రుద్రూర్‌: కోటగిరి శివారు నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న టాటా వాహనాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వాహనాన్ని కోటగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ షేక్‌ రఫిక్‌, వాహన యాజమాని షేక్‌ లతీఫ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సునీల్‌ తెలిపారు.

పేకాడుతున్న ఏడుగురి అరెస్టు

ఆర్మూర్‌టౌన్‌: ఆలూర్‌ మండల కేంద్రంలో పేకాట స్థావరంపై శుక్రవారం పోలీసులు దాడి చేసి, పేకాడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. అలాగే వారి నుంచి రూ. 10830 నగదు, ఐదు సెల్‌ఫోన్‌లు, మూడు వాహనాలను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

యువకుడి అదృశ్యం

బోధన్‌: ఎడపల్లికి చెందిన గట్టుపల్లి సాయి కుమార్‌ (27) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. సాయికుమార్‌కు సరైన ఉద్యోగం లభించక ఏడాదిగా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఈ నెల 4న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో అతడి భార్య ఆద్రిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో గేదె మృతి

పిట్లం(జుక్కల్‌): మండలంలోని రాంపూర్‌ గ్రామంలో గురువారం సాయంత్రం ఓ గేదె విద్యుత్‌ షాక్‌తో మృతిచెందింది. బాధితుడు తెలిపిన వివరాలు.. గ్రామంలోని రైతు ముందడి బలరాంరెడ్డికి చెందిన గేదె రోజులాగే గ్రామ శివారులో మేత మేసేందుకు వెళ్లింది. మేత మేస్తుండగా కింద పడిన విద్యుత్‌ తీగలను గేదె తాకడంతో విద్యుత్‌ షాక్‌తో అక్కడికక్కడే మరణించింది. రూ. 50వేల విలువ గల గేదె మృతి చెందడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

కామారెడ్డి క్రైం: డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యంను కామారెడ్డి సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ నగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి 40 కిలోల చొప్పున రేషన్‌ బియ్యంను సంచులలో నింపి దాదాపు 180 బస్తాలను ఓ డీసీఎంలో తరలించేందుకు సిద్ధం చేశారు. వెంటనే సీసీఎస్‌ పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి, సీసీఎస్‌ పోలీసులు కలిసి డీసీఎంను, డ్రైవర్‌ అర్బాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి వాటిని సివిల్‌ సప్లయ్‌ అధికారులకు అప్పగిస్తామని ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement