వాస్తవికతను మరిపించేలా..
సుభాష్‌నగర్: వరదలు, విపత్తులు సంభవించిన సమయాల్లో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా సోమవారం జిల్లాలో చేపట్టిన మాక్ ఎక్సర్‌సైజ్ విజయవంతంగా కొనసాగింది. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో మూ డు చోట్ల ఏకకాలంలో నిర్వహించిన కార్యక్రమాలు విపత్తుల సమయాల్లో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా వాస్తవికతను మరిపించేలా చేశాయి. డ్రోన్‌లు, వాటర్ బోట్‌లు, అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన సహాయక చర్యలు విపత్తుల నిర్వహణపై సన్నద్ధతను చాటిచెబుతూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందింపజేశాయి. జిల్లా కేంద్రంలోని రఘునాథ చెరువు వద్ద వరద జలాల్లో చిక్కుకుపోయిన వారిని, నీటి ప్రవాహంలో కొట్టుకుతుపోతున్న వారిని కాపాడి, తక్షణ వైద్య సేవలు, సహాయక చర్యలు చేపట్టే కార్యక్రమాలు విపత్తుల సందర్భంగా నెలకొనే హడావుడిని తలపించాయి. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఆంజనేయస్వామి ఇతర అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని వరద జలాలు చుట్టుముట్టిన సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని పేషెంట్లను హుటాహుటిన పైఅంతస్తులకు చేర్చి, వారి ప్రాణాలను ఎలా కాపాడాలి అనే దానిపై మాక్ ఎక్సర్‌సైజ్ ద్వారా చూపించారు. నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ పర్యవేక్షణలో మాక్‌డ్రిల్ జరిగింది. కాగా, వాస్తవికతను మరిపించేలా కొనసాగిన సహాయక చర్యలను చూసి రాష్ట్ర పరిశీలకుడు సురేశ్ కుమార్ సంతృప్తి వెలిబుచ్చారు. జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను అభినందించారు.
జీజీహెచ్, రఘునాథ చెరువు
ప్రాంతాల్లో మాక్‌డ్రిల్
పర్యవేక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన ప్రత్యేక పరిశీలకుడు
వాస్తవికతను మరిపించేలా..


